స్వర్ణాభరణాల వ్యాపారంలోకి శిల్పాశెట్టి
ముంబై: ప్రముఖ హిందీ సినిమా నటి శిల్పాశెట్టి సొంత బంగారం, ఆభరణాల కంపెనీని బుధవారం ప్రారంభించింది. సత్యుగ్ గోల్డ్ పేరుతో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. త్వరలో ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణే, చంఢీగర్, లూధియానా....ఈ ఏడు నగరాల్లో అవుట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి పేర్కొన్నారు. తానే స్వయంగా డిజైన్ చేసిన ఆభరణాలను కూడా ఈ అవుట్‌లెట్స్‌లో విక్రయిస్తామని వివరించారు. ప్రస్తుతమున్న మార్కెట్ ధర కంటే 37 శాతం తక్కువకే బంగారాన్ని కొనుగోలు చేసే స్కీమ్‌ను ఇండియన్ బులియన్ అండ్ జూయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) భాగస్వామ్యంతో అందిస్తున్నామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం గనుల కంపెనీలతో దీర్ఘకాలిక కాంట్రాక్టులు కుదుర్చుకున్నామని తెలిపారు. నవీ ముంబైలోని అప్తగ్ రిఫైనరీలో 42%, రాయల్ రిఫైనరీలో 50% వాటా సత్యుగ్ గోల్డ్ కొనుగోలు చేసిందని వివరించారు. గనుల నుంచి రిఫైనరీకి, రిఫైనరీ నుంచి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తామని, తమకు లభించే మార్జిన్లను వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో అందిస్తామని పేర్కొన్నారు. వివిధ సైజుల్లో 24 కేరట్ల బంగారు నాణేలను ఆఫర్ చేస్తున్నామని వివరించారు.