విద్యా ప్రమాణాల పెంపు
కడ్తాల : పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలంలోని కడ్తాల బాలికల ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ రికార్డులు, ఉపాధ్యాయుల పనితీరు, బోధనను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, ఏయే గ్రామాల నుంచి వస్తున్నారు, పరిసర ప్రాంతాల్లో ఎన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలున్నాయో ఆరా తీశారు.
ఆర్‌ఎంఎస్‌ఏ కింద నిర్మిస్తున్న ఆరు అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా, విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కాగా, మరో ఆరు అదనపు గదులను మంజూరు చేయాలని హెచ్ఎం పద్మ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ సిబ్బంది రాజారెడ్డి, ఉపాధ్యాయిని సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.