శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి
నడకుదురు(కరప):
రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటించి, సాగుచేస్తే తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ చైర్మన్ డి.వెంకటనరసింహరాజు సూచించారు. నడకుదురులోని కరప సబ్‌డివిజన్ ఏడీఏ కార్యాలయంలో మంగళవారం రైతులతో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఆత్మ కరప బ్లాకు ద్వారా ఎప్పటికప్పుడు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో సాగు మెళుకువలు వివరిస్తామన్నారు. వారి సూచనలు పాటిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలన్నారు. కరప ఏడీఏ ఎన్.రమేష్ మాట్లాడుతూ రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా పంటతెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్నారు. ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ పీఎల్ఆర్జే ప్రవీణ, సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.నందకిశోర్‌లు మాట్లాడుతూ వరిలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడా ఎర్రనల్లి, సుడిదోమ కనిపిస్తున్నాయని తెలిపి, రైతులకు నివారణ చర్యలు వివరించారు. ఎర్రనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లేదా ఇధియాన్ 2 మి.లీ. ఏదో ఒక మందును ఒక లీటరుకు కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఒక ఎకరాకు పిచి కారీ చేయాలన్నారు. సుడిదోమ నివారణకు ఇమిడాక్లోఫెడ్ 25 మి.లీ, లేదా డైనోతెప్యురాన్ 80 గ్రాములు లేదా టైమెప్రోజీన్ 120 గ్రాములు ఏదో ఒకదాన్ని ఒక ఎకరాకు పిచికారీచేయాలన్నారు. దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఎపిఫేట్ 300 గ్రాములు లేదా ఎటోఫిన్పాక్స్ 400 మి.లీ. ఏదో ఒకమందును ఒక ఎకరాకు పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. కరప బ్లాకులో ఆత్మద్వారా ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేయిన్తున్న ట్టు ఆత్మ ఏటీఎం పెందుర్తి అమర్నాథ్ తెలిపారు. కషాయాల తయారీ, వాటిని ఏయే తెగుళ్ల నివారణకు ఎలా వా డాలో తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించి, రైతుల కు పంపిణీ చేశారు. కరప, తాళ్లరేవు, కాజులూరు ఎంఏఓలు ఎ.అచ్యుతరావు, ఎం.సుజాత, మురళీధరన్ పాల్గొన్నారు.