టీవీఎస్ కొత్త స్కూటర్... జూపిటర్
చెన్నై: టీవీఎస్ మోటార్స్ స్కూటర్ సెగ్మెంట్లో కొత్త మోడల్, జూపిటర్ను సోమవారం విడుదల చేసింది. స్కూటర్లు నడిపే పురుషులను లక్ష్యంగా చేసుకుని 110 సీసీ కేటగిరీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ జూపిటర్ స్కూటర్ ధరను రూ.44,200(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్ చెప్పారు. 62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ స్కూటర్‌ను ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే విక్రయిస్తామని, దీపావళికల్లా దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు ప్రారంభిస్తామని వివరించారు. ఇప్పటి నుంచి ప్రతీ మూడు నెలలకొకసారి కొత్త మోడల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే జనవరిలో స్కూటీ జెస్ట్‌ను మార్కెట్లోకి తెస్తామని తెలిపారు.
నాలుగో మోడల్: స్కూటర్ సెగ్మెంట్లో మరింత వాటా లక్ష్యంగా టీవీఎస్ కంపెనీ నాలుగో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ స్కూటీ పెప్, స్కూటీ స్ట్రీక్, వెగో మోడళ్లను విక్రయిస్తోంది. ఈ జూపిటర్ స్కూటర్ హోండా యాక్టివా, హీరో మోటోకార్ప్ మ్యాస్ట్రో, యమహా రే జడ్ స్కూటర్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రత్యేకతలు: 17 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ(హెల్మెట్ పెట్టొచ్చు) ఉన్న ఈ స్కూటర్లో బాడీ బ్యాలెన్స్ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద అలాయ్ వీల్స్‌తో 4 రంగుల్లో(బ్లాక్, వైట్, గ్రే, రెడ్) లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, ట్విన్ సిటీ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, మొబైల్ చార్జింగ్ పాయింట్, ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్, గ్యాస్ చార్జ్డ్ రియర్ సస్పెన్షన్, పాసింగ్ లైట్ స్విచ్(ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్ ఉన్న తొలి స్కూటర్ ఇదే) వంటి ప్రత్యేకతలున్నాయి. వెనక వైపు ఉన్న ఎల్ఈడీ లైట్ల పైన పెట్రోల్ టాంక్ మూత ఉంది(పెట్రోల్ పోయించుకోవడానికి సీట్‌ను పైకి ఎత్తాల్సిన అవసరం లేదు).