బక్రీద్ రోజు జంతు వధ బ్యాన్.. కఠిన చర్యలు!
సాక్షి, సంభల్: బక్రీద్ పూట ఉత్తర ప్రదేశ్లోని సంభల్ ప్రాంతంలో జంతు బలి నిషేధంపై అధికారులు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రషీద్ ఖాన్ హెచ్చరించారు.
‘కుర్బానీ పేరిట ఎవరైనా ఆవు, ఎద్దు, దున్నపోతు, ఒంటెలను బలి ఇవ్వటం నిషేధం. సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయి. ఉల్లంఘించిన వారిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన తెలిపారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చినట్లు రషీద్ వెల్లడించారు.
గ్యాంగ్ స్టర్ యాక్ట్ ప్రకారం సదరు వ్యక్తి పేరును పోలీస్ రికార్డుల్లో చేరుస్తారు. వారిపై నిఘా కూడా ఎక్కువగా ఉంటుంది. మాములు పరిస్థితుల్లో 14 రోజులు, ఉద్రిక్తల సమయంలో 60 రోజులపాటు పోలీస్ రిమాండ్లో ఉంచుకునేందుకు ఆస్కారం ఉంది.
బకర్ ఈద్(ఈద్-ఉల్-జుహ). అంటే గొర్రెను బలిచ్చే పండుగ అని అర్ధం. ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా బక్రీద్ రోజు ప్రతి ముస్లిం జంతు బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు చేస్తూ బక్రీద్ ను జరుపుకుంటారు.