ఎంహెచ్370 అన్వేషణ నిలిపివేత
చైనా, మలేసియా, ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన
సిడ్నీ: మూడేళ్ల క్రితం హిందూ మహా సముద్రంలో కూలిపోయిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్370 కోసం జరుగుతున్న అన్వేషణను మంగళవారంతో నిలిపివేశారు. కూలిపోయినప్పుడు ఇందులో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. తప్పిపోయిన వారి కుటుంబాల అన్వేషణను నిలిపివేయడాన్ని బాధ్యతారాహిత్య చర్య అంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఎంతోమంది నిపుణులు పనిచేస్తున్నప్పటికీ విమానాన్ని కనిపెట్టలేకపోయామని చైనా, మలేసియా, ఆస్ట్రేలియా అధికారులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఈ విమానం 2014, మార్చి 8న హిందూ మహాసముద్రంలో మాయమైంది. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి, లక్షల చదరపు మైళ్లలో జల్లెడ పట్టినా విమానం జాడ దొరకలేదు. గత జూలైలో 1.2 లక్షల చదరపు మైళ్లు వెతికినా విమానం జాడ దొరకలేదని, దీంతో తాము వెతుకులాటని నిలిపివేస్తున్నామని తెలిపారు. ఈ విమానంలో 14 దేశాలకు చెందిన 227 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 153 మంది చైనీయులు కాగా, ఐదుగురు భారతీయులు, ఒక భారతీయ సంతతికి చెందిన కెనడా వ్యక్తి ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వాలు పొడిచిన వెన్నుపోటుగా బాధిత కుటుంబాల వారు అభివర్ణించారు.