పెట్టుబడుల తీరుపై సెబీ సర్వే
ఇన్వెస్టర్ల నుంచి వివరాల సేకరణకు సన్నాహాలు
29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సర్వే
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుపై సర్వేను నిర్వహించనుంది. తద్వారా దేశీ కుటుంబాల పొదుపు, పెట్టుబడుల ట్రెండ్‌పై అధ్యయనం చేయనుంది. ఈ విషయంలో సెక్యూరిటీల మార్కెట్‌పై పడినప్రభావం, ఏర్పడిన మార్పులు తదితర అంశాలపై వివరాలను సేకరించనుంది. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇన్వెస్టర్ సర్వేను చేపట్టనుంది. దీనిలో భాగంగా 50,000 కుటుంబాలు, 1,000 మంది స్టాక్ ఇన్వెస్టర్ల నుంచి వివరాలను సేకరించనుంది. సెబీ ఇంతక్రితం ఇలాంటి సర్వేను 2008-09లో మాత్రమే చేపట్టింది.
రిస్క్ ప్రొఫైల్‌పై అవగాహన
పొదుపు, పెట్టుబడులు, సెక్యూరిటీ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలపట్ల ఆసక్తి తదితర అంశాల ఆధారంగా ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యం(ప్రొఫైల్)ను అంచనా వేయనున్నట్లు సెబీ తెలిపింది. దీంతోపాటు ఇన్వెస్టర్ల అవగాహనను పెంచేందుకు చేపడుతున్న విద్యా సంబంధ కార్యక్రమాల ప్రభావాన్ని తెలుసుకోనున్నట్లు వివరించింది. ప్రైవేటు సంస్థల ద్వారా ఈ సర్వే నిర్వహించనుంది.
బోనస్ షేర్ల విక్రయానికి ఓకే
ప్రైమరీ మార్కెట్లకు జోష్‌నిచ్చే బాటలో బోనస్ షేర్ల విక్రయానికి సంబంధించి సెబీ నిబంధనలను సవరించనుంది. ఏదైనా ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు లేదా ఇతర ఇన్వెస్టర్లు తమకు లభించిన షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించనుంది. బోనస్ షేర్ల కేటాయింపు జరిగి ఏడాది పూర్తికానప్పటికీ విక్రయించేందుకు అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడాదిలోపు కేటాయించిన బోనస్ షేర్లను ఐపీవోలో అమ్ముకునేందుకు వీలులేదు