బంగారు బాతు..రెండో ఇల్లు
♦ అద్దెకివ్వటంతో అదనపు ఆదాయం
♦ అమ్మకం కోసమైనా ఖాళీగా ఉంచొద్దు
ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, సొంతిల్లు... ఈ మధ్యలో కారు!! ఇదీ... ఈ తరం యువత ఆలోచన. ఆదాయాలు పెరుగుతుండటంతో చాలామందికి ఇవన్నీ 30-40 ఏళ్లలోపే సాకారమైపోతున్నాయి. దాంతో చాలా మంది రెండో ఇంటిని కూడా కొనుక్కోగలుగుతున్నారు. మరి ఈ రెండో ఇంటి ద్వారా
♦ అధికాదాయం పొందటమెలా? అందుకూ మార్గాలున్నాయి.
రియల్ ఎస్టేట్‌పై డబ్బులు సంపాదించటానికి చాలామంది రకరకాల మార్గాలు ఎంచుకుంటుంటారు. డబ్బులు తగినంతగా ఉంటే ఫ్లాటో, ప్లాటో(స్థలం) కొనేసి, మంచి రేటు వస్తే అమ్మేసి లాభపడాలనుకునే వారు కొందరు. ముందు ఒక ఇంటిని కొనుక్కున్నాక... అదనంగా ఉన్న డబ్బులతో రెండో ఇంటిని కొని, దానిని అద్దెకివ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని భావించే వాళ్లు మరికొందరు. తక్కువలో ఏదైనా ఇల్లు అమ్మకానికొస్తే, దానిని ఠక్కున కొనేసి, మరికొంత లాభానికి అమ్మడం ద్వారా లాభాలు కళ్లజూడాలని ఆలోచించే వాళ్లు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఎప్పుడు మంచిరేటు వస్తే, అప్పుడు అమ్మేద్దామనే భావనతో ఇంటిని ఖాళీగా ఉంచుతారు. ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే లాభాలను వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత మందగించిన విషయం తెలిసిందే. ఈ మందగమన కాలంలో ఇంటిని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం ఇన్వెస్టర్‌కు ఒకింత ఊరటనిస్తుందనేది కాదనలేని వాస్తవం.
♦ఉదాహరణకు మీ దగ్గర కోటి రూపాయల విలువ చేసే ఇల్లు ఉందనుకుందాం.
దీనిని నెలకు రూ.50,000 చొప్పున అద్దెకిచ్చారనుకుందాం. అంటే ఏడాదికి మీకు రూ.6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే మీ ఇంటి అద్దె ఆదాయం(వార్షిక) మీ మూలధన విలువలో 6 శాతం అన్నమాట. సాధారణంగా మన దేశంలో సగటు ఇంటద్దె ఆదాయం రేటు 2-4 శాతం రేంజ్లో ఉంటుంది. అంటే మూల విలువలో 2-4 శాతమన్న మాట. రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణుల ప్రకారమైతే, మీ ఇల్లు మూలధన విలువలో 2 నుంచి 3 శాతం వరకూ వార్షికంగా ఇంటద్దె రూపంలో లభిస్తుంది. మీరు అందించే సౌకర్యాలు, మీ ఇల్లు ఉండే ఏరియాను బట్టి అద్దె విలువ మారుతుంటుంది. ఢిల్లీ, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇంటి అద్దె ఆదాయం రేటు 6-7 శాతంగా ఉంటోంది.
♦ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీ ఇంటి ద్వారా మంచి అద్దెనూ పొందే అవకాశాలున్నాయి.
ఇంటికి సరైన అద్దెను నిర్ణయించడం...
మీ ఇంటిమీద మీకు నెలవారీ వచ్చే అద్దెను సరిగా నిర్ణయించడమనేది ప్రధానమైన విషయం. మీ ఇల్లు ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న పరిస్థితులు, మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి అద్దె వస్తుంది. మీ ఇల్లు హౌసింగ్ సొసైటీలో ఉందనుకుందాం. అక్కడ ఉండే ఇళ్లన్నిటికీ ఒకే రకమైన అద్దె లభిస్తుంది. కొంచెం ఎక్కువ అద్దె రావాలంటే, ఇంటీరియర్స్‌ను మార్చడమో, లేక ఫర్నిచర్‌తో సహా అద్దెకు ఇవ్వడమో చేయాలి. ఒకవేళ మీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉందనుకుందాం. ఈ తరహా ఇళ్లకైతే సరైన అద్దె నిర్ణయించడం కొంచెం కష్టమైన పని. అయితే ఆ ఏరియాలో ఉండే ఇండిపెండెంట్ ఇళ్లను ఆయా ఇళ్ల యజమానులు ఎంతెంత ధరలకు అద్దెకిచ్చారో వాకబు చేయవచ్చు. ఇక్కడ కూడా అదనపు సౌకర్యాలు కల్పించడం ద్వారా అదనపు అద్దె పొందవచ్చు.
కొత్త తరం మార్కెటింగ్..
ఇప్పుడు అందరూ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నవారే. ఇంటర్నెట్ పుణ్యమాని మీ ఇంటిని మార్కెటింగ్ చేయడం ఇప్పుడు చాలా సులభం. మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్, కామన్‌ఫ్లోర్, హౌసింగ్‌డాట్‌కామ్, మకాన్‌డాట్‌కామ్ తదితర వెబ్సైట్లలో మీరు అద్దెకివ్వాలనుకున్న ఇంటిని గురించి ఉచితంగా అడ్వర్టయిజ్ చేయవచ్చు. ఇక ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్ల ద్వారా మీ రెండో ఇంటిని సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా, హాలిడే హోమ్‌గా అద్దెకు ఇవ్వడం ద్వారా ఒక్క రోజుకు రూ.3,000-రూ.5,000 వరకూ ఆదాయం పొందవచ్చు. అయితే ఇది అన్ని ఇళ్లకూ సాధ్యం కాకపోవచ్చు.
దీనికి ఇల్లుండే ప్రాంతమనేది ప్రధానం. త్రీ-స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడం, మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తేవడం ద్వారా మరికొంత అదనంగా అద్దె ఆదాయం పొందే అవకాశమూ ఉంది. మీరు కనుక ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వంటమనిషి/కేర్ టేకర్, డ్రైవర్‌తో కూడిన కారు, స్విమ్మింగ్ ఫూల్, క్లబ్ ఏరియా, జిమ్ తదితర సౌకర్యాలను కూడా అందిస్తే రోజుకు రూ.7,000-10,000 వరకూ కూడా అద్దె పొందవచ్చు. ఎయిర్ బీఎన్బీ వంటి రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్లు 3 శాతం వరకూ సర్వీస్ ఫీజును వసూలు చేస్తాయి.
అయితే మీ ఇంటిని సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా అద్దెకు ఇవ్వాలంటే పలు రకాల అనుమతులు, ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. మీరు అద్దెకు ఇవ్వాలనుకుంటున్న ఇల్లు ఏ ప్రాంతంలో ఉందో, ఆ ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ సొసైటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తీసుకోవాలి. సంబంధిత మునిసిపాలిటీ అధికారుల నుంచి అనుమతులు పాందాలి. పోలీసుల వెరిఫికేషన్ కూడా తప్పనిసరి.
సరైన కిరాయిదారు...
మీ ఇంటిని సరైన వ్యక్తికి అద్దెకివ్వటమనేది చాలా తెలివైన పని. అద్దెకు దిగే వ్యక్తి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు? జీతం ఎంత ? తదితర వివరాలను తెలుసుకోవాలి. వీలైతే ఆ వ్యక్తి పనిచేసే కంపెనీ నుంచి రికమండేషన్ లెటర్ తీసుకుంటే మరీ మంచిది. ఇక ఆహారపు అలవాట్లు గురించి మీకు ఏమైనా అభ్యంతరాలు, ఏమైనా షరతులు ఉంటే ముందుగానే వెల్లడించడం ఉత్తమం. ఆ తర్వాత గొడవ పడేకంటే ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే, మీకు, మీరు అద్దెకు ఇచ్చే వ్యక్తికి మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. అన్ని వివరాలు నచ్చితే, పూర్తి వివరాలతో కూడిన అగ్రిమెంట్‌ను రాసుకోవాలి.
ఒక రకంగా మీ రెండో ఇల్లు మీకు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటింది. అయితే మీకు వచ్చే ఆదాయంలో కనీసం పదో వంతు సొమ్ములతో మీ ఇంటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించడం కానీ, అదనపు సౌకర్యాలు కల్పించడం కానీ చేస్తే మీకు వచ్చే అద్దె విలువ మరింతగా పెరుగుతుంది.
పన్ను వివరాలు...
మీరు మీ ఇంటిని ఎలా అద్దెకు ఇచ్చారనే విషయాన్ని బట్టి పన్ను వివరాలుంటాయి. ఉదాహరణకు మీరు మీ ఇంటిని ఎవరికైనా నివసించడానికి అద్దెకు ఇచ్చారనుకోండి. ఈ అద్దెను ఇంటి ఆద్దె ద్వారా ఆదాయంగా పరిగణిస్తారు. ఒకవేళ సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా మీరు మీ ఇంటిని అద్దెకిస్తే, దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అద్దె ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతారు. మీరు అద్దె ద్వారా పొందే ఆదాయం రూ. 1లక్ష మించినట్లయితే ఈ అద్దె ఆదాయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలి.