సీఎం కార్మికుల పనివేళలు మార్చాలి
గోదావరిఖని(కరీంనగర్) : ఆర్జీ-1 ఏరియా పరిధి జీడీకే-11 గనిలో కంటిన్యూయస్ మైనర్(సీఎం) యంత్రంపై పనిచేస్తున్న కార్మికులను రెండో షిఫ్టు సమయం మార్పు చేయాలని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గనిమేనేజర్ రవీందర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూయస్ మైనర్ సెక్షన్లో రెండో షిఫ్టు రాత్రి 12 గంటల వరకు విధులను నిర్వహించాల్సి వస్తోందని, దీంతో కార్మికులు అజీర్తి, అల్సర్, నిద్రపట్టకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు.
అంతేకాకుండా తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కంపెనీలో పనిచేసే ప్రతీ కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని ఓవైపు యాజమాన్యం కోరుకుంటూనే మరోవైపు అందుకు విరుద్ధంగా పని చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమలుచేస్తున్న సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టును రద్దు చేసి పాతపద్ధతిలో సాయంత్రం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు పనివేళలు మార్చాలని కోరారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జంగ కనుకయ్య, గని ఫిట్ సెక్రటరీ మోదుల సంపత్, టీబీజీకేఎస్ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ ఆరెళ్లి పోషం, ఫిట్ సెక్రటరీ గుమ్మడి లింగయ్య, నాయకులు ఎం.పద్మారావు, ఆరె శ్రీనివాస్, రేండ్ల రవీందర్, ఆరెపల్లి రాజమౌళి, పి.శ్రీనివాస్, జి.పెంటయ్య, యు.బుచ్చయ్య, రాజేశ్వర్‌రావు, ఒ.చంద్రయ్య, పి.రమేశ్, ఎం.వెంకటస్వామి పాల్గొన్నారు.