రైలు ప్రమాద మృతులను గుర్తించారు
గుల్బర్గా : సికింద్రాబాద్ - బాంద్రా దురంతో ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు వ్యక్తులను రైల్వే అధికారులు గుర్తించారు. కర్ణాటకలో శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఈ ఎక్స్ప్రెస్ తొమ్మిది బోగీలు పట్టాలు తప్పిన ఘటనలో మొత్తం ఇద్దరు మహిళలు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డ విషయం విదితమే. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే గుల్బర్గా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సెంట్రల్ రైల్వే కేంద్రం పరిధిలోని గుల్బర్గా సమీపంలో ఈఘటన చోటుచేసుకుంది. మృతులు లత(28), జ్యోతి(46) లుగా అధికారులు గుర్తించారు. వీరు పుణెకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. సికింద్రాబాద్ - లోకమాన్య తిలక్ 2220 ట్రైన్ తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.