ఆక్రమణల తొలగింపుపై ఉద్రిక్తత
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : కాగజ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపు పర్వం శుక్రవారం కూడా కొనసాగింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన తొలగింపు కార్యక్రమం రాత్రి 3 గంటల వరకు కొనసాగింది. తిరిగి శుక్రవారం ఉదయం 7 గంటలకే తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా నుంచి మొదలుకుని పీహెచ్సీ రోడ్డు, ఇందిరామార్కెట్, రైల్వేస్టేషన్ ఏరియా, మెయిన్మార్కెట్, బస్టాండ్ ఏరియా, ఎన్టీఆర్ చౌక్, ఈఎస్ఐ ఆస్పత్రి, వెంకటరమణ థియేటర్ ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తొలగించారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్ నేతృత్వంలో తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు.
పట్టణంలో ఐదు జేసీబీలు ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు గడువు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను తొలగిస్తుండడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. తహశీల్దార్ మల్లేశ్, ఎంపీడీఓ సత్యనారాయణసింగ్, మున్సిపల్ డీఈ కృష్ణలాల్, సిర్పూర్(టి) తహశీల్దార్ రమేశ్‌గౌడ్‌లను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జేసీబీల వద్ద ఇన్‌చార్జీలుగా నియమించారు. గతంలో ఎన్నడూలేని విధంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా అధికారులు జేసీబీలతో కూలుస్తుండంపై వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీసం సమయం ఇవ్వాలని కోరుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదు.
గాంధీచౌక్ గుండా కొత్తరోడ్డు
పట్టణంలో కొందరు ఆక్రమణదారుల వల్ల ఉన్న రోడ్లు కూడా కనిపించకుండా పోయాయి. అధికారుల ఆక్రమణల తొలగింపుతో గాంధీచౌక్ ముందు భాగం నుంచి సరోజినీదేవి రోడ్డు వరకు ఉన్న రోడ్డు వెలుగులోకి వచ్చింది. ఇన్నా ళ్లు అక్రమ కట్టడం ఉండడంతో రోడ్డు మూసివేతకు గురైంది. అక్రమణలు తొలగించేందుకు అధికారులు రాగా స్థానికులు జేసీబీని అడ్డుకున్నారు. సబ్‌కలెక్టర్ అక్కడికి చేరుకుని మున్సిప ల్ ప్లాన్‌ను పరిశీలించారు. గల్లిరోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టారని, నిర్మాణాన్ని తొల గించారు. ప్రస్తుతం రోడ్డు ఏర్పాటు కావడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారీ బందోబస్తు
అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు పృథ్వీధర్‌రావు, రహ్మాన్, ఎస్సైలు సాదిక్అహ్మద్, తిరుపతితోపాటూ ఏఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.
మంత్రికి ఫిర్యాదు చేస్తా..
- కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే
ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెలపారు. ఆయన ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారికి అధికారుల ఏకపక్ష నిర్ణయంతో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
బాధితులను ఆదుకోవాలి..
- కోనప్ప, మాజీ ఎమ్మెల్యే
పట్టణంలోని రోడ్ల వెడల్పు వల్ల జీవనోపాధి కోల్పోతున్న బాధితులను ఆదుకోవాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీయార్ చౌరస్తా వద్ద సబ్‌కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కొన్ని అక్రమ కట్టడాలను చూసిచూడనట్లు వదిలివేసి అమాయకుల కట్టడాలను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల మేరకు అన్ని అక్రమకట్టడాలను తొలగిస్తానని సబ్‌కలెక్టర్ హామీ ఇచ్చారు.