Seed difficulties
-
పొలం పిలుస్తోంది విత్తనం పొమ్మంటోంది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో విత్తన కష్టాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. సకాలంలో విత్తనాలు అందించాల్సిన అధికారులే తీవ్ర జాప్యానికి కారణం అవుతున్నారు. విత్తనాల అందించే విషయంలో అధికారుల ప్రణాళిక లోపం రైతులకు శాపంగా మారింది. బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అవసరాలకు సరిపడా విత్తనాలు సరఫరా కాకపోవడం ఒక ఎత్తై, ఉన్న విత్తనాలను ఏపీసీడ్స్ సక్రమంగా మంజూరు చేయకపోవడం మరో ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల్లో అసహనం పెరుగుతోంది. అరకొరగా ఉన్న విత్తనాలను కూడా ఆయా మండలాల్లో సరఫరా చేయకపోవడంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, కురిచేడు ఇంకా చుట్టు పక్కల మండలాల నుంచి వందలాది మంది రైతులు విత్తనాలకోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతిరోజూ నిద్రలేచి విత్తనాల కోసం జిల్లా కేంద్రానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి జిల్లా కేంద్రానికి చేరుకుంటున్న రైతులూ ఉన్నారు. తీరా వచ్చినా తోపులాటలు ... ఇక్కట్లే తప్ప ఫలితం దక్కడం లేదు. ఇంత జరుగుతున్నా రైతన్నల కష్టాలు తీర్చాల్సిన అధికార పార్టీ నేతలు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అవసరమైనన్ని ఏవీ జిల్లాకు రబీలో వరి వేసుకునేందుకు సుమారుగా 60 వేల క్వింటాళ్ల వరకు అవసరమవుతాయని అంచనా. కానీ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం కేవలం మూడు వేల క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం వరి యన్ఎల్ఆర్ -145 రకం విత్తనం 2,200 క్వింటాళ్లున్నాయి. వీటిలో గత వారం రోజులుగా 1200 క్వింటాళ్లు పంపిణీ చేశారు. జిల్లాలో శనగలు 93,660 హెక్టార్లలో వేస్తారు. దీని కోసం 63,672 కింట్లాళ్ల విత్తనాలు అవసరం కాగా కేవంల 927 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మినుము 5146 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 390 క్వింటాళ్లు మాత్రమే అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. వేరుశనగ, సన్‌ఫ్లవర్, మొక్కజొన్న, సజ్జ అసలు అందుబాటులో లేవు. నియోజకవర్గానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయాలి : రైతు నేత దుగ్గినేని గోపీనాథ్ రైతులకు సరిపడా విత్తన సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 60 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. కానీ కేవలం మూడు వేలు క్వింటాళ్లు సరిపోతాయని అధికారులు ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టడంలోనే శ్రద్ధ ఎంతుందో అర్థమవుతోంది. రైతుల సౌకర్యార్థం ప్రతి నియోజకవర్గంలో విత్తన సరఫరా కేంద్రం ఏర్పాటు చేసి తగినన్ని విత్తనాలు సరఫరా చేయాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
విత్తు అందితే ఒట్టు!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభంలోనే అన్నదాతకు విత్తన కష్టాలు మొదలయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులైనా జిల్లాలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయలేదు. ఎన్నడూ లేనివిధంగా విత్తన పంపిణీలో జాప్యం జరుగుతున్నా.. కొత్త ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నెల 3వ తేదీ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. తర్వాత అడపాదడపా అక్కడక్కడ వానలు పడుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటికే దాదాపు 25 వేల హెక్టార్లలో విత్తనం పనులు పూర్తయ్యాయి. అయితే వేరుశనగ, పత్తి, జీలుగ విత్తనాలకు తీవ్ర కొరత ఉన్నా.. ప్రభుత్వం ఇంతవరకు దృష్టి సారించకపోవడంపై రైతులు భగ్గుమంటున్నారు. జిల్లాలో వేరుశనగ 1,34,916 హెక్టార్లలో సాగవుతుండగా 75 వేల క్వింటాళ్ల విత్తనం అవసరం. అయితే ప్రభుత్వం 40 వేల క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కేటాయించింది. కేటాయింపు రెండు నెలలు ముందు జరిగినా విత్తనాలను పొజిషన్ చేయకుండా.. ఏపీ సీడ్స్, దానికి వేరుశనగ సరఫరా చేసే దళారులు అధిక ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. నంద్యాల డివిజన్‌తోపాటు జిల్లాలో వరి సాగు చేసే ప్రాంతాల్లో పచ్చరొట్ట ఎరువుగా దోహదపడే జీలుగ, పిల్లి పెసర విత్తనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే జిల్లాకు 4500 క్వింటాళ్ల జీలుగ, 3000 క్వింటాళ్ల పిల్లి పెసర మంజూరయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులవుతున్నా పంపిణీ అతీ గతీ లేదు. విత్తనాల కోసం శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు మండలాల్లో రైతులు బారులుదీరుతున్నారు. మరోవైపు నాసిరకం విత్తనాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. బీటీ పత్తి విత్తనాల పేరుతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విత్తన సమస్యపై అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. ఈ రైతు పేరు మంగన్న. అరికెర గ్రామ వాసి. ఈయనకు ఆరెకరాల పొలం ఉంది. ఈ ఏడాది వేరుశనగ సాగు చేయాలనుకున్నాడు. అయితే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు అందలేదు. వర్షాలు కురుస్తాయో లేదో అన్న ఆందోళనతో అరకొర పదునులోనే పత్తి విత్తనాలు నాటాడు. అయితే చినుకు జాడ లేకపోవడంతో భూమిలోంచి మొలక రాలేదు. విత్తనాల కోసం చేసిన అప్పు తీర్చే మార్గం కోసం ఈయన అన్వేషిస్తున్నాడు.