విత్తు అందితే ఒట్టు! | subsidized seeds are not distributed in district | Sakshi

విత్తు అందితే ఒట్టు!

Published Fri, Jun 20 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఖరీఫ్ ప్రారంభంలోనే అన్నదాతకు విత్తన కష్టాలు మొదలయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులైనా జిల్లాలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయలేదు.

కర్నూలు(అగ్రికల్చర్):  ఖరీఫ్ ప్రారంభంలోనే అన్నదాతకు విత్తన కష్టాలు మొదలయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులైనా జిల్లాలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయలేదు. ఎన్నడూ లేనివిధంగా విత్తన పంపిణీలో జాప్యం జరుగుతున్నా.. కొత్త ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నెల 3వ తేదీ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. తర్వాత అడపాదడపా అక్కడక్కడ వానలు పడుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
 
జిల్లాలో సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటికే దాదాపు 25 వేల హెక్టార్లలో విత్తనం పనులు పూర్తయ్యాయి. అయితే వేరుశనగ, పత్తి, జీలుగ విత్తనాలకు తీవ్ర కొరత ఉన్నా.. ప్రభుత్వం ఇంతవరకు దృష్టి సారించకపోవడంపై రైతులు భగ్గుమంటున్నారు. జిల్లాలో వేరుశనగ 1,34,916 హెక్టార్లలో సాగవుతుండగా 75 వేల క్వింటాళ్ల విత్తనం అవసరం. అయితే ప్రభుత్వం 40 వేల క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీపై పంపిణీ చేసేందుకు కేటాయించింది. కేటాయింపు రెండు నెలలు ముందు జరిగినా విత్తనాలను పొజిషన్ చేయకుండా.. ఏపీ సీడ్స్, దానికి వేరుశనగ సరఫరా చేసే దళారులు అధిక ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుండటం గమనార్హం.
 
నంద్యాల డివిజన్‌తోపాటు జిల్లాలో వరి సాగు చేసే ప్రాంతాల్లో పచ్చరొట్ట ఎరువుగా దోహదపడే జీలుగ, పిల్లి పెసర విత్తనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే జిల్లాకు 4500 క్వింటాళ్ల జీలుగ, 3000 క్వింటాళ్ల పిల్లి పెసర మంజూరయ్యాయి. సీజన్ మొదలై 20 రోజులవుతున్నా పంపిణీ అతీ గతీ లేదు. విత్తనాల కోసం శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు మండలాల్లో రైతులు బారులుదీరుతున్నారు. మరోవైపు నాసిరకం విత్తనాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. బీటీ పత్తి విత్తనాల పేరుతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విత్తన సమస్యపై అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది.
 
ఈ రైతు పేరు మంగన్న. అరికెర గ్రామ వాసి. ఈయనకు ఆరెకరాల పొలం ఉంది. ఈ ఏడాది వేరుశనగ సాగు చేయాలనుకున్నాడు. అయితే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు అందలేదు. వర్షాలు కురుస్తాయో లేదో అన్న ఆందోళనతో అరకొర పదునులోనే పత్తి విత్తనాలు నాటాడు. అయితే చినుకు జాడ లేకపోవడంతో భూమిలోంచి మొలక రాలేదు. విత్తనాల కోసం చేసిన అప్పు తీర్చే మార్గం కోసం ఈయన అన్వేషిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement