సాగుకు ఉత్తమ మార్గం.. ప్రకృతి సేద్యం
– విదేశీ పద్ధతులు విడనాడకుంటే సాగు వినాశనమే
– నీటి కోసం యుద్ధం తప్పదు
– ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్
తిరుపతి తుడా/అలిపిరి :
‘మితిమీరి రసాయనాలను వినియోగించి భూ గర్భాన్ని కలుషితం చేశాం. హరిత విప్లవంతో మన దేశీయ విత్తన సంపదను పోగొట్టుకున్నాం. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానిదే భవిష్యత్తు. సాగుకు ఉత్తమ మార్గం కూడా అదే.’ అని ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. చివరిరోజు శిక్షణలో ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు గో ఆధారిత ప్రకృతి సేద్యానికి పూనుకోకతప్పదని హెచ్చరించారు. అధిక దిగుబడులు ఆశించి, సంకరజాతి విత్తనాల కోసం పాకులాడి అధిక రసాయనాలను ఏ స్థాయిలో వినియోగిస్తే అదే స్థాయిలో రైతు అన్ని రకాలుగా నష్టపోకతప్పదన్నారు. ఇప్పటికే భూమిలోని సూక్ష్మజీవులు క్షీణ దశకు చేరాయని, ఇంకా రసాయనాల వినియోగం కొనసాగిస్తే సూక్ష్మజీవులను పూర్తి స్థాయిలో కోల్పోక తప్పదన్నారు. అదే పరిస్థితి తలెత్తితే ఆ తరువాత సాగుకు దారే ఉండదని చెప్పారు. ముందుగా మేల్కొని ప్రకృతి వ్యవసాయన్ని కొనసాగిస్తే పంట ఎదుగుదలకు దోహదపడే సూక్ష్మజీవులను వృద్ధి చేసుకుని పూర్వ వైభవాన్ని అందుకోవచ్చని సూచించారు. అజ్ఞానంలో ఉంటూ విదేశీ సాగు విధానాలను విడనాడకుండా ఉంటే వ్యవసాయానికి వినాశనం తప్పదని హెచ్చరించారు. మూడో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే అది నీటి కోసమే ఉంటుందన్నారు. ఇందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య జరుగుతున్న కావేరి జల వివాదమే ఇందుకు సాక్షమని చెప్పుకోవచ్చని అన్నారు. ప్రకృతిలో ఉన్నది విజ్ఞాన శాస్త్రమని, మానవుడు సృష్టించింది సాంకేతిక శాస్త్రమన్న విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. మట్టిలో ‘వాపస’ ప్రక్రియ జరగకుండా మొక్కలకు ఎంత నీరు అందించినా ఎదుగుదల ఉండదన్నారు.
అవగాహనతోనే అధిక దిగుబడి
వరి, కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు ప్రకృతి సేద్యంతోనే సాధ్యమవుతుందని పాలేకర్ అన్నారు. జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం ఉపయోగించి వరి, కూరగాయల పంటల్లో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే పద్ధతుల గురించి ఆయన వివరించారు.
మండల స్థాయిలో నిర్వహిస్తాం
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో రైతులు ఎంతగానో ఉత్తేజితమయ్యారని తెలిపారు. పాలేకర్ సూచనలు పాటిస్తామంటూ రైతులు చెబుతున్నారని, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయిలో 9 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మారుతున్న కాలానుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ విధానాలు అవలంభించాలన్నారు. రైతులను సంక్షోభం నుంచి బయట పడేయగలిగే ఏకైక మార్గం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయమే అన్నారు.