ప్రభుత్వ పాఠశాలల తీరు మారాలి
కొన్నింట్లో మాత్రమే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి..
సమీక్ష సమావేశంలో ఎస్ఎస్ఏ రాష్ట్ర సీఎంఓ హరికృష్ణ
విద్యారణ్యపురి : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సం స్కరణలు చేపడుతున్నందున, ప్రైవేట్ విద్యపై మోజు తగ్గడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల తీరు మారేలా కృషి జరగాల్సిన అవసరముందని సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) రాష్ట్ర సీఎంఓ(కమ్యూనిటీ మొబిలైజర్) హరికృష్ణ అన్నారు. ఎస్ఎస్ఏ రాష్ర్ట శాఖ నుంచి వచ్చిన మూడు బృందాలు మూడు రోజులుగా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించి అక్కడి స్థితిగతులను తెలుసుకున్నారు.
ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హన్మకొండలోని డైట్ కళాశాలలో ఎంఈఓలు, సెక్టోరియల్ ఆఫీసర్లతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో హరికృష్ణ మాట్లాడారు. కొన్ని పాఠశాల్లో అద్భుతమైన ప్రమాణాలు ఉండగా, మరికొన్నింట్లో విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేనట్లు తమ పరిశీలనలో తేలిం దని ఆయన తెలిపారు.
జిల్లాలోని బీరెల్లి పాఠశాల తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ పాఠశాలగా నిలిచిందని, దీనికి హెచ్ఎం, ఉపాధ్యాయుల కృషే కారణమని హరికృష్ణ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల స్థలా ల రికార్డులు అందుబాటులో ఉంచడం తో పాటు ఖాళీ స్థలం ఉంటే మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని ఆయన సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ఎవరైనా ఆర్థికంగా చేయూతనిస్తే వారి పేర్లను ప్రదర్శించాలని కోరారు.
కనీస సామర్థ్యాలు కరువయ్యాయి..
మూడు రోజుల తనిఖీల్లో భాగంగా పలు పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు కనీసం చదవడం, రాయ డం కూడా రావడం లేదని గుర్తించామని రాష్ట్ర పరిశోధన శిక్షణ సంస్థ ప్రొఫెసర్ కృష్ణమోహన్ తెలిపారు. ఓ విద్యార్థి పదో తరగతి తర్వాత ఇంటర్ చదువుకుంటానని చెప్పినా ఇంటర్మీడియట్ రాయడం రాలేదని, మరో విద్యార్థి తమ ఉపాధ్యాయుడికి రూ.3వేల వేతనమని చెప్పారని... ఇలాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
జిల్లా ఏజేసీ, ఎస్ఎస్ఏ ఇన్చార్జ పీఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఇటీవల కొన్ని పాఠశాలలను సందర్శించిన క్రమంలో కొన్నింట్లో పరిస్థితి నిరాశజనకంగా ఉందన్నారు. డీఈఓ ఎస్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలల పర్యవేక్షణను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఎంఈఓ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాము ఎంఈఓలుగా కాకుండా మల్టీ టాస్క్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించాల్సి వస్తోం దని, అనేక బాధ్యతలు తమకు అప్పగిస్తున్నారన్నారు.
దీనికి పరిష్కారమార్గం చూపాల్సింది ఉన్నతాధికారులేనని అభిప్రాయపడ్డారు. సమావేశంలో డాక్టర్ బాల, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, ఎస్ఎస్ఏ జిల్లా ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ బి.మనోజ్‌కుమార్, జీసీడీఓ బి.రాధ, ఏఎల్ఎస్ ఎస్జీఆర్పీ సురేష్, డిప్యూటీ డీఈఓ నరేందర్‌రెడ్డి, డైట్ కళాశాల అధ్యాపకుడు సోమయ్యతో పాటు ఎంఓఈలు పాల్గొన్నారు.