ఈపీఎఫ్ విత్‌డ్రాలకు ఒక్కటే దరఖాస్తు
న్యూఢిల్లీ: పిల్లల వివాహాలు, ఉన్నత విద్య, గృహరుణాలు, గృహనిర్మాణం, ఆధునీకీకరణ, భూమి కొనుగోలు ఇలా వేర్వేరు సందర్భాల్లో నగదు అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాలోని నగదును విత్‌డ్రా చేసే చందాదారులు ప్రస్తుతం వేర్వేరు దరఖాస్తు ఫామ్‌లను నింపుతున్నారు. ఇకపై వీటన్నింటికీ బదులుగా ఒకే పేజీలో తయారైన ఒక్కటే దరఖాస్తు నింపితే సరిపోతుందని ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో) సంస్థ మంగళవారం ప్రకటించింది.
ఈ దరఖాస్తుకు స్వీయ ధ్రువీకరణ లాంటివి కూడా అవసరంలేదని సంస్థ స్పష్టంచేసింది. పీఎఫ్ ఖాతాతో ఆధార్, బ్యాంకు ఖాతా లను అనుసంధానం చేసుకున్న వారు నేరుగా 19(యూఏఎన్), 10సీ(యూఏఎన్), 31(యూఏఎన్) ఫారాలను పంపే వీలుంది. ఈ ఫారాలకు ఉద్యోగ సంస్థల అటస్టేషన్ అక్కర్లేదు. అనుసంధానం చేసుకోనివారు అటస్టేషన్తో 19, 10సీ, 31 ఫారాలను నింపాల్సి ఉంటుంది.