రైళ్లలో సెల్ఫీలు తీసుకుంటే జైలే!
మనం ప్రయాణిస్తున్న రైలు పచ్చని కొండప్రాంతాల నుంచి మలుపులు తిరుగుతూ వెళ్తున్నప్పుడు డోర్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ఎవరికైనా అనందంగానే ఉంటుంది. కానీ ఇక అలా చేస్తే ఐదేళ్లపాటు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. ఇలా సెల్ఫీలు తీసుకుంటూ రైలుకింద పడిపోయి లేదా పక్కనుంచి వెళుతున్న మరో రైలుకింద పడి మరణిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు సెల్ఫీలు తీసుకోవడాన్ని నేరంగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ మేరకు రైల్వేచట్టంలో సవరణలు సూచిస్తూ కొన్ని ప్రతిపాదనలు రూపొందించారు.
సెల్ఫీలు తీసుకుంటే జరిమానాతోపాటు గరిష్ఠంగా ఐదేళ్లపాటు జైలుశిక్ష విధించాలని సూచిస్తున్న ఈ ప్రతిపాదనలు త్వరలో కేంద్ర హోం శాఖ ముందుకు రానున్నాయి. రైళ్ల రాకపోకల సందర్భంగా ఫ్లాట్ఫారాలపైన, రైలు పట్టాలపైన సెల్ఫీలు తీసుకోవడాన్ని నిరోధించేందుకు రైల్వే పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఇలా కూడా రైలు కిందపడి ప్రయాణికులు మరణిస్తున్నందున ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీలు తీసుకోవడం వల్ల వారికే కాకుండా తోటి ప్రయాణికులకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అందుకని అలా సెల్ఫీలు తీసుకుంటున్న ప్రయాణికులను అరెస్ట్ చేసి ఆత్మహత్యా ప్రయత్నం నేరం కింద కేసులు నమోదు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. గుజరాత్ రైల్వే డివిజన్లో ప్రస్తుతం చేపట్టిన ఈ చర్యలను దేశంలోని అన్ని డివిజన్లలో కూడా త్వరలో ప్రవేశపెడతామని రైల్వే అధికారులు తెలిపారు.
రైళ్లలో సెల్ఫీలతో పాటు పేకాట ఆడటాన్ని కూడా న్యూసెన్స్‌గా పరిగణించి జరిమానా, జైలుశిక్షలు విధించేలా రైల్వే చట్టాన్ని సవరించాలని కూడా కేంద్రానికి ప్రతిపాదన చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైళ్లలో పేకాటను అరికట్టేందుకు న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తున్నామని వారు తెలిపారు.