senior accountant
-
ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఆభరణాలు, నగదు
-
మనోజ్ అవినీతి విలాసం..
అనంతపురం క్రైం: ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే. వీటి వెనుక ఉన్న ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ ఆస్తుల విలువ రూ.3 కోట్ల పైమాటేనని పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని బాలప్ప ఇంట్లో మారణాయుధాలున్నాయనే సమాచారంతో ఈ నెల 18న ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీసీఎస్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించి బంగారం, వెండి, నగదు, డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అవన్నీ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ మనోజ్వేనని విచారణలో గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్.. బాలప్ప ఇంట్లోకి పెట్టెలు ఎలా వచ్చాయంటే.. మనోజ్ అనంతపురంలోని సాయినగర్ 8వ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్‌కుమార్‌కు ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. మనోజ్‌కుమార్‌కు బుక్కరాయసముద్రంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా.. అందులో పనిచేసేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగ వెళ్లేవాడు. అలా నమ్మకం ఏర్పడిన తర్వాత అతడినే మనోజ్ తన కారు డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఏడేళ్లుగా నాగలింగ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ ఆస్తులను నాగలింగ తన మామ బాలప్ప ఇంట్లో దాచిపెట్టాడు. నగదు...నగలు...వాహనాల స్వాధీనం మనోజ్ కారు డ్రైవర్‌గా పనిచేసే నాగలింగ మామ బాలప్ప ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెలను పరిశీలించగా అందులో 54 బంగారు ఆభరణాలు.. మొత్తం 2.42 కేజీల బంగారం, 280 వెండి సామగ్రితో పాటు మొత్తంగా 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు , రూ.49.10 లక్షల విలువైన 24 ఫిక్స్డ్ డిపాజిట్/ఎన్ఎస్ఎస్ బాండ్లు, రూ.27.05 లక్షల విలువైన 145 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు పిస్తోళ్లు, 18 రౌండ్లు, ఒక ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా బీకేఎస్‌లో ఉన్న మనోజ్ వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బృందాలు పరిశీలించగా.. అక్కడ రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ టాప్ మోడల్ కార్లు, ఒక హార్డీ డేవిడ్ సన్ మోటర్ వాహనం, మూడు ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలు, రెండు కరీజ్మా ద్విచక్ర వాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్తోళ్లు.. అవన్నీ డమ్మీ పిస్తోళ్లే పోలీసుల సోదాల్లో మూడు పిస్తోళ్లు, ఒక ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ డమ్మీవేనని ఓఎస్డీ వెల్లడించారు. పిస్తోళ్లతో పాటు 16 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్చినప్పుడు వాటి నుంచి ఫైర్, సౌండ్ మాత్రమే వస్తాయనీ, వీటితో షూట్ చేసినా ఎవరికీ ప్రాణహాని ఉండదని తెలిపారు. కేసు నమోదు భారీ మొత్తంలో ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు కలిగి ఉండడంతో మనోజ్కుమార్పై సీఆర్ నం 213/2020,యు/ఎస్ 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశామని ఓఎస్డీ వివరించారు. కేసు చేధింపులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ బి.సత్యయేసు బాబు అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఈ.శ్రీనివాసులు, ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐలు సాయిప్రసాద్, శ్యాంరావు, ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీ దృష్టికి మనోజ్ వ్యవహారం చిరు ఉద్యోగి మనోజ్ భారీగా నగదు, నగలు దాచుకోవడం...పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సత్యయేసుబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మనోజ్ అక్రమాస్తులపై ఏసీబీ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ముందే చెప్పిన ‘సాక్షి’ జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందనీ, ముడుపులిస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలవని ‘సాక్షి’ ఈ ఏడాది మే 21న ‘ముడుపుల ఖజానా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అవినీతి తతంగంలో తెర వెనుక ఇద్దరు ఉద్యోగులున్నారని, అందులో సీనియర్ అకౌంటెంట్ మనోజ్ కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. ఉద్యోగులకు డీఏ, అరియర్స్ విషయంలోనూ సదరు సీనియర్ అకౌంటెంట్ భారీ స్థాయిలో దందాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, వీటితో పాటు కార్యాలయంలో ఎవరికైనా మెమో, షోకాజ్ తదితర నోటీసులిస్తే సమాధానం అతనే రాసి వారితో సొమ్ము చేసుకుంటున్నారని మే నెలలో ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. -
అవినీతి ‘ఖజానా’ ఆస్తి రూ.3 కోట్ల పైనే
అనంతపురం క్రైం: అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఒక ఎయిర్ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ బుధవారం విలేకరులకు తెలియజేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని.. మనోజ్కుమార్పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారు. అవినీతి డొంక కదిలిందిలా.. ► మనోజ్‌కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ శ్యామ్‌రావు రంగంలోకి దిగారు. ► మనోజ్‌కుమార్ డ్రైవర్ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా.. బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. ► వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న పోలీసులు విలాసవంతమైన జీవితం ► మనోజ్‌కుమార్ బెంగళూరు వెళ్లేందుకు ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ వాడేవాడని.. దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ► రూ.7 లక్షల విలువైన మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, రెండు కరిజ్మా బైక్స్, రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ కార్లు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇవికాకుండా హోండా యాక్టివా, తాను పెంచుతున్న గుర్రాల కోసం లీజుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాడు. -
సీనియర్ అకౌంటెంట్‌కు రిమాండ్
కోవెలకుంట్ల: స్థానిక ఉప ఖజానా కార్యాలయ సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సదురుద్దీన్ను గురువారం రిమాండ్‌కు తరలించారు. ఉయ్యాలవాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బషీర్అహమ్మద్కు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఈ మేరకు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్
చీరాల : ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఖజానా శాఖ సీనియర్ అకౌంటెంట్ అక్కేశ్వరరావు.. ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు... వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హాస్టల్ వాచ్‌మెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన గరికా శంకర్రావుకు ప్రభుత్వం నుంచి రూ.1.20 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. అయితే వీటిని మంజూరు చేసేందుకు అక్కేశ్వరరావు రూ.15వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోమవారం చీరాలలో తహసీల్దారు కార్యాలయం ఆవరణలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో శంకర్రావు నుంచి రూ.5వేలు లంచం తీసుకంటుండగా అక్కేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు. -
బెండి తీశారు
శ్రీకాకుళం క్రైం: శ్రీకాకుళం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ బెండి మోహనరావు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నంలో నివాసముంటు న్న ఓ ఉద్యోగి శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. అయితే అతనికి రావల్సిన గ్రాట్యుటీ సొమ్ము కోసం తను పని చేసిన ఇరిగేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ్నుంచి ఆ ఫైల్ జిల్లా ట్రెజరీకి వెళ్లగా అక్కడ్నుంచి శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి వచ్చింది. ఇక్కడ నుంచి ఫైల్ మంజూరై బదిలీ చేయటానికి సీనియర్ అకౌంటెంట్ మోహనరావు లంచం అడిగాడు. ఆ విశ్రాంతి ఉద్యోగికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు గ్రాట్యుటీ సొమ్ము అందాల్సి ఉంది. వచ్చే సొమ్ములో పది శాతం తనకు లంచంగా ఇవ్వాలని, అలా అయితేనే ఫైల్ బదిలీ జరుగుతుందని తేల్చిచెప్పాడు. అంటే రూ.50 వేల నుంచి 60 వేలు వరకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఎక్కువ మొత్తం ఇచ్చుకోలేనని ఆ విశ్రాంతి ఉద్యోగి చెప్పగా ముందు రూ.పది వేలు ఇవ్వు తరువాత మాట్లాడుకుందామని మోహనరావు చెప్పాడు. దీంతో చేసేది లేక ఆ విశ్రాంతి ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రసాయనాలు పూసిన రూ.500 నోట్లు పది వేల రూపాయలు ఆ విశ్రాంతి ఉద్యోగికిచ్చి పంపించారు. బెండి.. ఎంచక్కా ఆ నోట్లను తీసుకుని లెక్కపెట్టి జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి దూసుకెళ్లి మోహనరావును అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు, విజయనగరం సీఐలు లకో్ష్మజీ, రమేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఓ విశ్రాంతి ఉద్యోగి గ్రాడ్యూటీకి సంబంధించిన ఫైల్‌ను మంజూరు చేసి జారీ చేయటానికి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మోహనరావు రూ.పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడన్నారు. విశ్రాంతి ఉద్యోగి తన వివరాలను గోప్యంగా ఉంచాలని చెప్పడంతో బయటకు చెప్పలేకపోతున్నామని వివరించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా అవినీతికి పాల్పడితే దాడులు తప్పవని హెచ్చరించారు. -
ఏసీబీ వలలో ఖజానా కార్యాలయం ఉద్యోగి
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్, జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ డి.రవికిరణ్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల పన్ని పట్టుకున్నారు. గుంటూరు ఏసీబీ డిఎస్పీ రాజారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాసరి బాలకృష్ణ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ఎరన్డ్ లీవ్ రూ. 4 లక్షల50 వేలు మంజూరు కావాల్సివుంది. జిల్లా ఖజానా కార్యాలయంలో ఏప్రిల్ 9వ తేదీ బిల్లు సమర్పించాడు. బిల్లు మంజూరు నిమిత్తం సీనియర్ అకౌంటెంట్ రవికిరణ్ లక్షకు వెయ్యి రూపాయల వంతున రూ.4,500 లంచం డిమాండ్చేశాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి న బాలకృష్ణ తనకు బిల్లు మంజూరై బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాగానే ఇచ్చేట్లుగా రవికిరణ్‌తో ఏప్రిల్ 18న ఒప్పం దం చేసుకున్నాడు. గత నెల 22వ తేదీ బాలకృష్ణ ఖాతాలో రూ. 4 లక్షల 50 వేలు జమయింది. దీంతో తనకు లంచం కింద రూ. 4,500 ఇవ్వాలని రవికిరణ్ ప్రతీ రోజూ బాలకృష్ణకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. అనుకున్న ప్రకారం డబ్బులివ్వకపోతే తదుపరి వచ్చే బెనిఫిట్లను నిలుపుదల చేస్తానని హెచ్చరించడం తో బాలకృష్ణ గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల వ్యూహం మేరకు శుక్రవారం బాలకృష్ణ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ రవికిరణ్‌కు మూడు వేల రూపాయలు ఇచ్చాడు. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న రవి కిరణ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నింది తుడు రవికిరణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎ స్పీ రాజారావు తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎం.నరసింహారెడ్డి, కె.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.