అవినీతి ‘ఖజానా’ ఆస్తి రూ.3 కోట్ల పైనే | Manoj kumar corruption exposed in 8 trunk boxes | Sakshi

అవినీతి ‘ఖజానా’ ఆస్తి రూ.3 కోట్ల పైనే

Aug 20 2020 4:51 AM | Updated on Aug 20 2020 9:43 AM

Manoj kumar corruption exposed in 8 trunk boxes - Sakshi

రాయల్‌ ఎన్‌ఫీల్డ్, గుర్రపుస్వారీ‌ పై మనోజ్‌ (ఫైల్‌)

అనంతపురం క్రైం: అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ గాజుల మనోజ్‌కుమార్‌ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్‌ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఒక ఎయిర్‌ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్‌ శాఖ ఓఎస్‌డీ రామకృష్ణ ప్రసాద్‌ బుధవారం విలేకరులకు తెలియజేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని.. మనోజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారు. 

అవినీతి డొంక కదిలిందిలా.. 
► మనోజ్‌కుమార్‌ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా..  ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ ప్రసాద్, సీసీఎస్‌ సీఐ శ్యామ్‌రావు రంగంలోకి దిగారు. 
► మనోజ్‌కుమార్‌ డ్రైవర్‌ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా.. బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. 
► వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి.
స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న పోలీసులు  

విలాసవంతమైన జీవితం 
► మనోజ్‌కుమార్‌ బెంగళూరు వెళ్లేందుకు ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ వాడేవాడని.. దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. 
► రూ.7 లక్షల విలువైన మూడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు, రెండు కరిజ్మా బైక్స్, రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ కార్లు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇవికాకుండా హోండా యాక్టివా, తాను పెంచుతున్న గుర్రాల కోసం లీజుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement