senior assistent
-
కాంట్రాక్ట్ ఉద్యోగిని రోజాపై దాడి
సాక్షి, కామారెడ్డి : మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు నిర్వహించే కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని రోజాపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ దాడికి ఒడిగట్టాడు. గతంలో రామకృష్ణ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పని చేశాడు. ఆ సమయంలో రోజా జూనియర్ అసిస్టెంట్ అయిన రామకృష్ణ కింద పని చేసేవారు. గత ఏడాది రామకృష్ణ పదోన్నతిపై బోధన్ మున్సిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్ళాడు. బదిలీపై వెళ్లిన నుంచి తరచుగా రామకృష్ణ రోజాకు ఫోన్ చేసి మాట్లాడేవాడని తెలిసింది. గత నెల రోజులుగా రామకృష్ణ ఫోన్ చేసిన రోజా స్పందించకపోవడంతో ఆవేశానికి గురైన రామకృష్ణ సోమవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రోజాపై దాడి చేశాడు. (బయటపడుతున్న రెవెన్యూ లీలలు!) అంతేకాకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశాడు. ఈ దాడిలో రోజా ముక్కుకు తీవ్ర గాయం అయింది. వెంటనే రోజాను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో రోజా ఫిర్యాదు చేయగా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను దాడి చేసే దృశ్యాలు స్థానికులు ఫోన్లో రికార్డు చేశారు. అతని తీరుపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఆలయ పరిసరాల్లో టిఫిన్ సెంటర్ నిర్వహణకు తాళాలిచ్చేందుకు రూ.15వేలు డిమాండ్ చేసిన దేవదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెంకు చెందిన బి.శేషానంద్ 2017లో టిఫిన్ సెంటర్ నిర్వహణ కోసం ఆలయ పరిసరాల్లోని షాపు అద్దెకు తీసుకుని 2018 వరకు నడిపించాడు. అనంతరం అతని భార్య అనారోగ్యానికి గురికావడంతో కొద్దికాలంగా షాపు తీయలేదు. మరలా ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉన్న అద్దె బకాయి తీర్చేశాడు. అలాగే టిఫిన్ షాపు నిర్వహణకు షెడ్ తాళాలు ఇవ్వాలని కోరాడు. అయితే సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణామాచార్యులు షెడ్‌కు సంబంధించి తాళాలు ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో శేషానంద్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తానని సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులను షాపు వద్దకు సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో పిలిచాడు. కృష్ణమాచార్యులు డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని, రూ.15 వేలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఆలయంలోని పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వేపగుంటలోని కృష్ణమాచార్యులు ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు సోదాలు చేశారు. సోదాల్లో సీఐలు గణేష్, అప్పారావు, రమేష్, గఫూర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నన్ను చంపేస్తారేమో!
కర్నూలు సీక్యాంప్ : ‘‘సార్.. నా విధులు నన్ను నిర్వర్తించుకోనీయడం లేదు. అధికార పార్టీ నేతల అనుచరులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి నన్ను చంపేస్తారేమో!’’ అని కర్నూలు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాను కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు తాలుకా పోలీసులకు ఆమె గురువారం ఫిర్యాదు చేశారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు అప్రూవల్ కోసం కర్నూలు ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్లోని ఈసెక్షన్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి అవి తిరిగి ఆర్డీవో కార్యాలయానికి వస్తాయి. తప్పులు ఉండడం, సరైన ఆధారాలు లేని కారణంగా దరఖాస్తులను ఈ సెక్షన్ ఆఫీసర్ తిరిగి వెనక్కి పంపుతున్నారు. అయితే ఇవి ఆర్డీఓ కార్యాలయంలోనే ఆగిపోతున్నాయని..కొందరు టీడీపీ కార్యకర్తలు గురువారం సీనియర్ అసిస్టెంట్ భానుపై చిందులేశారు. ‘‘చాలా రోజులుగా మమ్మల్ని తిప్పుకుంటున్నావ్.. ఏంటి నీ బాధ’’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమవుతూ తాలూకా పోలీసులను ఆశ్రయించారు. దాదాపు గంట సేపు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని తన సమస్య అంతా పోలీసులకు వివరించారు. అయితే ఆర్డీఓ కార్యాలయం తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తప్పుకున్నారు. డిప్యూటీ సీఎం అనుచరుల హల్చల్.. సీనియర్ అసిస్టెంట్ భాను.. తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారన్న విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరులు హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ తహసీల్దార్ నిత్యానందరాజుపై మండిపడ్డారు. ‘డిప్యూటీ సీఎం చెప్పినా, మంత్రి లోకేష్ ఫైల్ అని చెప్పినా.. మా పనులు కావడంలేదు’ అని ఆగ్రహించారు. అనంతరం బాధితురాలి వద్దకు వచ్చి.. ‘ మీరేమీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.. బేతంచెర్లలోని మా పొలం పని అయిపోతే.. మీ నుంచి మాకు సమస్య ఉండబోదు’ అని దరఖాస్తులు తీసుకెళ్లారు. -
గోల్మాల్..!
సర్వజనాస్పత్రి కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్ స్టాఫ్‌నర్సును బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్టాఫ్‌నర్సుకు చెందిన రూ. 50 వేల చలానా కట్టినట్లు ఫోర్జరీ చేశాడు. ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా సదరు సీనియర్ అసిస్టెంట్‌పై విచారణకు ఆదేశించి ఆర్డీకు సరెండర్ చేసింది. అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని సునీత అనే స్టాఫ్‌నర్సు గతేడాది నవంబర్‌లో ఎమ్మెస్సీ పరీక్షల కోసం సెలవు పెట్టారు. ఆ నెల జీతం డిసెంబర్లో స్టాఫ్‌నర్సు ఖాతాలో జమ అయ్యింది. ఈమె సెలవులో వెళ్లిన విషయాన్ని ఆలస్యంగా కార్యాలయం సిబ్బందికి తెలియజేశారు. గత నెల జీతం అకౌంట్లో పడిందని తెలియజేశారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ ఆ మొత్తాన్ని తనకిస్తే చలానా రూపంలో ట్రెజరీకి చెల్లిస్తామన్నారు. స్టాఫ్‌నర్సు సునీత రూ.55 వేల నగదును సీనియర్ అసిస్టెంట్‌కు అందజేశారు. సీనియర్ అసిస్టెంట్ రూ. 5వేలు మాత్రమే చెల్లించి, రూ.50 వేలు తీసుకున్నాడు. ట్రెజరీకు చెల్లించిన స్లిప్‌ను స్టాఫ్‌నర్సుకు అందజేశాడు. ఆ స్లిప్‌లో అంకెలను దిద్దిన విషయాన్ని పసిగట్టిన స్టాఫ్‌నర్సు వెంటనే ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం సూపరింటెండెంట్ దృష్టికి వెళ్లగా.. ఆయన విచారణకు ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్ తప్పిదం చేసినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను కడపలోని ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేశారు. పైసలిస్తేనే పనులు! : సర్వజనాస్పత్రిలోని ఆఫీస్ కార్యాలయంలో పైసలివ్వందే పనులు జరగడం లేదు. పది మంది స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల ఫైల్ ఆర్డీ కార్యాలయానికి పంపడంలోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఒక్కో స్టాఫ్‌నర్సుతో రూ.3 వేలు లంచం తీసుకున్నట్లు తెల్సింది. ఆస్పత్రి కార్యాలయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారిపోయాయి. పర్యవేక్షించాల్సిన యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని చర్చించుకుంటున్నారు. వాస్తవమే సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ హుస్సేన్ స్టాఫ్‌నర్సు సునీత వేతనాన్ని తీసుకున్న మాట వాస్తవమే. ట్రెజరీకి రూ.5వేలు మాత్రమే చెల్లించాడు. దీనిపై విచారణకు ఆదేశించి సదరు ఉద్యోగిని ఆర్డీకి సరెండర్ చేశాం. – డా.జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
– రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం కోసిగి (మంత్రాలయం) : కోసిగి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ డి.వెంకటేష్ లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దొడ్డి గ్రామానికి చెందిన యెహోనా, ఆయన వదిన సువార్తమ్మ ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఫారాలను కార్పొరేషన్‌కు , బ్యాంకుకు పంపించాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశారు. దీంతో యెహోనా కర్నూలులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి సీనియర్ అసిస్టెంట్‌కు రూ.10వేల నగదు అందజేశాడు. దాన్ని ఆయన పక్కనే ఉన్న బీరువాలో ఉంచారు. ఐదు నిమిషాల్లోనే ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఎస్ఐలు నాగభూషణం, ఖాదర్‌బాషా అక్కడికి చేరుకుని..సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి దరఖాస్తులతో పాటు నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఎనిమిది మంది అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అధికారులు గానీ, సిబ్బంది గానీ లంచం డిమాండ్ చేస్తే నేరుగా కర్నూలు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదుల చేయాలని ప్రజలకు సూచించారు. అలాగే 94404 46178 (డీఎస్పీ), 94404 46129, 94913 05630(ఎస్ఐలు) నంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చన్నారు. 18 ఏళ్లుగా ఇక్కడే.. సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ 18 ఏళ్లుగా కోసిగిలోనే పనిచేస్తున్నారు. ఈయన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద 1998 నవంబర్ రెండున కోసిగి మండల పరిషత్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. ఇక్కడే సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి వచ్చింది. ఇటీవల నందవరం మండల పరిషత్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే.. తిరిగి కోసిగికి డిప్యుటేషన్‌పై వచ్చారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలవరం భూసేకరణ స్పెషల్ సబ్‌కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగి ప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. జీలుగుమిల్లికి చెందిన ఓ రైతు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిహారం చెల్లించేందుకు రైతును లంచం అడగడటంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రైతు నుంచి సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.