ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
Published Fri, Jun 30 2017 1:38 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
– రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
కోసిగి (మంత్రాలయం) : కోసిగి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ డి.వెంకటేష్ లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దొడ్డి గ్రామానికి చెందిన యెహోనా, ఆయన వదిన సువార్తమ్మ ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఫారాలను కార్పొరేషన్‌కు , బ్యాంకుకు పంపించాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశారు. దీంతో యెహోనా కర్నూలులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి సీనియర్ అసిస్టెంట్‌కు రూ.10వేల నగదు అందజేశాడు. దాన్ని ఆయన పక్కనే ఉన్న బీరువాలో ఉంచారు.
ఐదు నిమిషాల్లోనే ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఎస్‌ఐలు నాగభూషణం, ఖాదర్‌బాషా అక్కడికి చేరుకుని..సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి దరఖాస్తులతో పాటు నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఎనిమిది మంది అవినీతి అధికారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అధికారులు గానీ, సిబ్బంది గానీ లంచం డిమాండ్ చేస్తే నేరుగా కర్నూలు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదుల చేయాలని ప్రజలకు సూచించారు. అలాగే 94404 46178 (డీఎస్పీ), 94404 46129, 94913 05630(ఎస్‌ఐలు) నంబర్లకు ఫోన్ చేసి తెలపవచ్చన్నారు.
18 ఏళ్లుగా ఇక్కడే..
సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ 18 ఏళ్లుగా కోసిగిలోనే పనిచేస్తున్నారు. ఈయన తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద 1998 నవంబర్ రెండున కోసిగి మండల పరిషత్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. ఇక్కడే సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి వచ్చింది. ఇటీవల నందవరం మండల పరిషత్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే.. తిరిగి కోసిగికి డిప్యుటేషన్‌పై వచ్చారు.
Advertisement