‘మేక్ ఇన్ ఇండియా’ కేవలం నినాదమే!
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఒక నినాదం మాత్రమేనని సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తయారీలోని డిమాండ్లు, విలోమ పన్ను వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, అధిక ధరలను తగ్గించడం లాంటి సవాళ్లను మోదీ ప్రభుత్వం ఎదుర్కోలేకపోయిందని అన్నారు.
గతేడాదితో పోలిస్తే 2015లో ఎగుమతులు 11 శాతం తగ్గాయని, గతేడాది 26.89 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్న ఎగుమతులు 2015 జనవరిలో 23.88 డాలర్లకు పరిమితమయ్యాయని అన్నారు.
జీఎస్టీ బిల్లులో అంతర రాష్ట్ర పన్నును 1 శాతం పెంచడాని బట్టి చూస్తే ఆర్థిక సమస్యలపై వారికి అవగాహన లేదని తెలుస్తోందన్నారు. ఇది జీఎస్టీ స్పూర్తికి విరుద్ధమని,
మేక్ ఇన్ ఇండియాకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఏడాదికాలంలో పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ ధరలు 15 నుంచి 28 శాతం వరకు పెరిగాయన్నారు. ఆర్థికవృద్ధి, దిశలపై మోదీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదన్నారు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, ఎరువులు, కరెంటు, స్టీల్ పరిశ్రమల్లో వృద్ధి 2014-2015లో 3.5 శాతం పడిపోయిందని అన్నారు. ఏడాది పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న ప్రభుత్వం 17.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు.