మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరం..?
సల్మా అల్-షెహబ్ అనే 34 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియా కోర్టు 34 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. అసమ్మతివాదులను ట్విటర్లో అనుసరించడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్ చేశారన్న నేరారోపణలతో కఠిన శిక్ష వేసిందని ‘గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు 34 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది. సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
అసలేం జరిగింది?
బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న సల్మా అల్-షెహబ్‌ను 2021, జనవరి 15న సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సెలవులకు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను నిర్బంధించారు. శాంతిభద్రతలకు విఘాతం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇంటర్నెట్ను వినియోగించారన్న ఆరోపణలతో మొదట ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. ఓరల్, డెంటల్ మెడిసిన్‌లో నిపుణురాలైన సల్మా.. ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పైళ్లై, చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab
🔴 Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM
— ESOHR (@ESOHumanRightsE) August 16, 2022
సల్మా విడుదలకు డిమాండ్
హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఏఎల్క్యుఎస్టీ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు ఈ తీర్పును ఖండించాయి. సల్మా అల్-షెహబ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ‘సల్మాను విడిపించాలని సౌదీ అధికారులను కోరుతున్నాం. ఆమె పిల్లల సంరక్షణకు, ఆమె చదువును పూర్తి చేయడానికి వీలు కల్పించేలా విముక్తి ప్రసాదించాల’ని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాద’ని స్పష్టం చేసింది.
In the #Saudi authorities’ longest prison sentence ever for a peaceful activist, the Specialised Criminal Court of Appeal on 9 August handed down terms totalling 34 years without suspension to women’s rights campaigner Salma al-Shehab. #SaudiArabiahttps://t.co/3bRLwqioec pic.twitter.com/fYgVrATNFX
— ALQST for Human Rights (@ALQST_En) August 15, 2022
సుదీర్ఘ జైలు శిక్షపై అభ్యంతరాలు
సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ట్విటర్లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ‘అసమ్మతివాదులు ట్విటర్ ఖాతాలను అనుసరించడం, వారి ట్వీట్లను రీట్వీట్ చేయడం ద్వారా సమాజంలో చిచ్చు రేపడానికి, జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు కారణమయ్యారని’ ఆమెపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. షియా ముస్లిం కాబట్టే ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించారని నమ్ముతున్నట్టు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం సల్మా గళమెత్తారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను జెడ్డాలో జూలై 15న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో ప్రమేయంతో పాటు, అనేక మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజుతో బైడన్ భేటీ కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. (క్లిక్: ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం)