20 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీలో మంగళవారం జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేశారు.
నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఉండడంతో వచ్చే నెల 20 నుంచి సమావేశాలను జరపాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ... ప్రభుత్వం 10 రోజులు నిర్వహించేందుకు అంగీకరించింది. దేవాలయాల పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు, సైబరాబాద్ కమిషనరేట్ విభజన, వ్యాట్ ఆర్డినెన్స్‌లను మంగళవారమే సభలో ఆమోదించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.