Server Sundaram
-
సర్వర్ సుందరం
‘సర్వర్’ అనే మాట మీద దక్షిణ భారతదేశం వారికి పేటెంట్ ఉన్నట్టుంది. హోటల్లో ‘సర్వ్’ చేసే వ్యక్తిని ‘సర్వర్’ అనాలని మనమే కనిపెట్టాం. ‘వెయిటర్’, ‘స్టివార్డ్’ అని మనం దాదాపుగా వాడం. ప్రపంచంలో సర్వర్ అనే మాట వాడరు. కళ్లు తడవకుండా జీవితాన్ని దాటే యొచ్చుగాని సర్వర్‌ని పిలవకుండా మనకు బతుకు గడవదు. అతని చేతుల మీదుగా రెండిడ్లీ ఒక వడ అందితే దానిని తగినంత సాంబారుతో తిని ఆపై కాఫీ తాగి తేన్చుకుంటూ బయటికి నడవడం మధ్యతరగతి జీవితంలో మహా విలాసం. ఊరికొక ‘కాకా హోటల్ ’ఎలా ఫేమస్సో అందులో పనిచేసే సర్వర్ కూడా ఫేమస్. ఓనర్ తెలిసినా తెలియకపోయినా ఈ సర్వర్ కచ్చితంగా తెలిసే ఉంటాడు. ‘నూనె ఎక్కువగా వేసి డబుల్ రోస్ట్ చేసిన మసాలా దోసె’ మాత్రమే మనకిష్టం అని కనిపెట్టినవాడికి మనం టిప్పు కూడా ఇస్తాం. తప్పక మర్యాద చేస్తాం. దక్షిణ భారతీయ సాహిత్యంలో, సినిమాల్లో సర్వర్ ప్రముఖ పాత్ర పోషించాడు. ‘శారద’గా తెలుగు కథా సాహిత్యంలో పేరుపొందిన నటరాజన్ తెనాలిలో సర్వర్‌గా పని చేశాడు. డబ్బుకు లాటరీ కొట్టే యవ్వన రోజుల్లో కరకరలాడే ఆకలికి హోటల్ దోసె తినడం ఎంత విలువైన విషయమో ముళ్లపూడి వెంకటరమణ తన ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’లో తెలియచేశారు. ఇక ప్రముఖ రచయిత త్రిపుర రాసిన రెండు కథలు ‘భగవంతం కోసం’, ‘హోటల్లో’ కాఫీ హోటల్లోనే నడుస్తాయి. సినిమాలు సరేసరి. కె.బాలచందర్ కమెడియన్ నగేష్‌ను హీరోగా చేసి ‘సర్వర్ సుందరం’ సినిమా తీశాడు. తెలుగులో బాపు తీసిన ‘శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’లో కృష్ణ సర్వర్. బ్రహ్మానందంను పెట్టి జంధ్యాల ‘బాబాయ్ హోటల్’ తీశారు. ‘శుభలేఖ’లో చిరంజీవి, ‘త్రిమూర్తులు’లో వెంకటేశ్, ‘వింత దొంగలు’లో రాజశేఖర్, ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ... నిన్న మొన్నటి సినిమా ‘పెళ్లిచూపులు’లో విజయ్ దేవరకొండతో సహా అందరూ హోటల్ని నడుపుతూ ప్లేట్లు అందించినవాళ్లే. ఇక బిల్లు కట్టక ప్లేట్లు కడిగి హాస్యం పండించిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కాని అదంతా గతం గతః. ఇప్పుడు అందరి లుక్కూ మారింది. కరోనా అందరినీ మార్చేసింది. లాక్డౌన్ వల్ల దాదాపు మూడు నెలలుగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. మనకు ఎంతో ఆత్మీయుడైన సర్వర్ ఇదిగో ఇలా ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని ఒక రెస్టారెంట్లో దోసెలు సర్వ్ చేస్తూ కెమెరాకు పోజ్ ఇచ్చాడు. అతని ఆరోగ్యం, మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ పూరీ పెసరట్టుల అల్పహార రంగం కళకళలాడాలని కోరుకుందాం. -
సంతానం హీరోగా ‘సర్వర్ సుందరం’
స్టార్ కమెడియన్ సంతానం హీరో గా తెరకెక్కిన చిత్రం ‘సర్వర్ సుందరం’. సంతానంకు జోడిగా వైభవి నటిస్తున్న ఈ చిత్రంలో రాధా రవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2016లోనే పూర్తయినప్పటికీ రకరకాల కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్‌కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు పోటీగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ వంటి సెన్సెషన్ స్టార్ సినిమా వస్తున్న రోజే ‘సర్వర్ సుందరం’రిలీజ్ అవుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా కోసం సంతానం హోటల్ సర్వర్‌గా ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా ఆడియన్స్‌ను ఫుల్‌గా అలరిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. అంతేకాకుండా మాస్ ఎలిమెంట్స్‌కు కూడా ఢోకా లేదని తెలిపారు. బల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ హర్ష వడ్డెల, డి. వెంకటేష్‌లు నిర్మించారు. -
29న సర్వర్‌సుందరం
తమిళసినిమా: ఇప్పుడు సగటు మనిషికి కావలసింది వినోదం ఒక్కటే. నిత్యం సవాలక్ష సమస్యలతోనో, ఊపిరాడనంత పనులతోనో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు కాస్త రిలాక్స్ నిచ్చేది సినిమానే అయితే. అందులో ఆహ్లాదానిచ్చేవి వినోదభరిత కథా చిత్రాలే. అలా ప్రేక్షకుల చేత నవ్వుల పువ్వులు పూయించడానికి సర్వర్సుందరంగా వచ్చేస్తున్నాడు నటుడు సంతానం. హాస్యనటుడిగా పంచ్ డైలాగ్స్‌తో అందరిని అలరించిన ఈయన హీరోగా అవతారమెత్తినా వినోదాన్నే ఆయువుపట్టుగా విజయాలను అం దుకుంటున్నారు. దిల్లుక్కు దుడ్డు వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత సంతానం నటిస్తు న్న చిత్రాల్లో సర్వర్‌సుందరం ఒక టి. కెన్నా ఫిలిం స్ పతాకంపై రాజాసుందర్ నిర్మించిన ఈ చిత్రంలో సంతానంకు జంటగా వైభివి శాండిల్య నటించింది. సీనియర్ నటుడు రాధారవి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా ఆనంద్బాల్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సం తోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన సర్వర్సుంద రం చిత్ర టీజర్, ట్రైలర్లను ప్రేక్షకులు మిలియన్ల సంఖ్యంలో లైక్ చేశారని చిత్ర వర్గాలు తెలిపారు. దీంతో చిత్రంపై అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయని, ఆ అంచనా లను సర్వర్‌సుందరం కచ్చితంగా రీచ్ అవుతుం దనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. వినోదమే ప్రధానంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని అంటున్నారు. చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
గోవాలో సర్వర్‌సుందరం చిత్రీకరణ
దివంగత ప్రఖ్యాత హాస్యనటుడు నగేష్ నటించిన క్లాసిక్ మూవీ సర్వర్‌సందరం. అదే పేరుతో ఇప్పుడు ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగి కథానాయకుడిగా అవతారమెత్తిన సంతానం చిత్రం చేస్తున్నారు.ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం సోమవారం నుంచి గోవాలో చిత్రీకరణ జరుపుకోనుంది. కెనన్యా ఫిలింస్ పతాకంపై జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయిన నగేష్ చిత్రం సర్వర్‌సందరం పేరుకు భంగం కలిగించకుండా ఉండాలంటే సంతానం నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ముందడుగు వేస్తోందనిపిస్తోంది. సంతానం నుంచి దర్శకుడు, చిత్ర యూనిట్ అంతా తాజా సర్వర్‌సుందరం విషయంలో ప్రత్యేక దృష్టి చూపుతోందట. చిత్రాన్ని గోవాలో మొదలెట్టి దుబాయ్, చెన్నై, తంజావూర్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి సుందరమైన ప్రదేశాల్లో సర్వర్‌సుందరం చిత్ర షూటింగ్‌ను జూన్ వరకూ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. సంతానం తను ధరించే దుస్తుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందుకోసం దేశంలోని 15 మంది ప్రముఖ సర్వర్లను రప్పించి వారిని కన్సల్టెంట్లుగా నియమించుకుని దుస్తులు తదితర విషయాల్లో వారి సూచనలు, సలహాలతో చిత్రీకరణ జరపనున్నారట. చిత్ర దర్శకుడు ఆనంద్ బాల్కీ కూడా పూర్వం సర్వర్ కావడంతో ఈ సర్వర్‌సుందరం చిత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సంసిద్ధమయ్యారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీత బాణీలు కడుతున్నారన్నది గమనార్హం.