‘సర్వర్’ అనే మాట మీద దక్షిణ భారతదేశం వారికి పేటెంట్ ఉన్నట్టుంది. హోటల్‌లో ‘సర్వ్’ చేసే వ్యక్తిని ‘సర్వర్’ అనాలని మనమే కనిపెట్టాం. ‘వెయిటర్’, ‘స్టివార్డ్’ అని మనం దాదాపుగా వాడం. ప్రపంచంలో సర్వర్ అనే మాట వాడరు. కళ్లు తడవకుండా జీవితాన్ని దాటే యొచ్చుగాని సర్వర్‌ని పిలవకుండా మనకు బతుకు గడవదు. అతని చేతుల మీదుగా రెండిడ్లీ ఒక వడ అందితే దానిని తగినంత సాంబారుతో తిని ఆపై కాఫీ తాగి తేన్చుకుంటూ బయటికి నడవడం మధ్యతరగతి జీవితంలో మహా విలాసం. ఊరికొక ‘కాకా హోటల్ ’ఎలా ఫేమస్సో అందులో పనిచేసే సర్వర్ కూడా ఫేమస్. ఓనర్ తెలిసినా తెలియకపోయినా ఈ సర్వర్ కచ్చితంగా తెలిసే ఉంటాడు. ‘నూనె ఎక్కువగా వేసి డబుల్ రోస్ట్ చేసిన మసాలా దోసె’ మాత్రమే మనకిష్టం అని కనిపెట్టినవాడికి మనం టిప్పు కూడా ఇస్తాం. తప్పక మర్యాద చేస్తాం.
దక్షిణ భారతీయ సాహిత్యంలో, సినిమాల్లో సర్వర్ ప్రముఖ పాత్ర పోషించాడు. ‘శారద’గా తెలుగు కథా సాహిత్యంలో పేరుపొందిన నటరాజన్ తెనాలిలో సర్వర్‌గా పని చేశాడు. డబ్బుకు లాటరీ కొట్టే యవ్వన రోజుల్లో కరకరలాడే ఆకలికి హోటల్ దోసె తినడం ఎంత విలువైన విషయమో ముళ్లపూడి వెంకటరమణ తన ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’లో తెలియచేశారు. ఇక ప్రముఖ రచయిత త్రిపుర రాసిన రెండు కథలు ‘భగవంతం కోసం’, ‘హోటల్లో’ కాఫీ హోటల్‌లోనే నడుస్తాయి. సినిమాలు సరేసరి. కె.బాలచందర్ కమెడియన్ నగేష్‌ను హీరోగా చేసి ‘సర్వర్ సుందరం’ సినిమా తీశాడు. తెలుగులో బాపు తీసిన ‘శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’లో కృష్ణ సర్వర్.
బ్రహ్మానందంను పెట్టి జంధ్యాల ‘బాబాయ్ హోటల్’ తీశారు. ‘శుభలేఖ’లో చిరంజీవి, ‘త్రిమూర్తులు’లో వెంకటేశ్, ‘వింత దొంగలు’లో రాజశేఖర్, ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ... నిన్న మొన్నటి సినిమా ‘పెళ్లిచూపులు’లో విజయ్ దేవరకొండతో సహా అందరూ హోటల్‌ని నడుపుతూ ప్లేట్‌లు అందించినవాళ్లే. ఇక బిల్లు కట్టక ప్లేట్లు కడిగి హాస్యం పండించిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కాని అదంతా గతం గతః. ఇప్పుడు అందరి లుక్కూ మారింది. కరోనా అందరినీ మార్చేసింది. లాక్‌డౌన్ వల్ల దాదాపు మూడు నెలలుగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. మనకు ఎంతో ఆత్మీయుడైన సర్వర్ ఇదిగో ఇలా ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌లో దోసెలు సర్వ్ చేస్తూ కెమెరాకు పోజ్ ఇచ్చాడు. అతని ఆరోగ్యం, మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ పూరీ పెసరట్టుల అల్పహార రంగం కళకళలాడాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment