దివంగత ప్రఖ్యాత హాస్యనటుడు నగేష్ నటించిన క్లాసిక్ మూవీ సర్వర్‌సందరం. అదే పేరుతో ఇప్పుడు ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగి కథానాయకుడిగా అవతారమెత్తిన సంతానం చిత్రం చేస్తున్నారు.ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం సోమవారం నుంచి గోవాలో చిత్రీకరణ జరుపుకోనుంది. కెనన్యా ఫిలింస్ పతాకంపై జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయిన నగేష్ చిత్రం సర్వర్‌సందరం పేరుకు భంగం కలిగించకుండా ఉండాలంటే సంతానం నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ముందడుగు వేస్తోందనిపిస్తోంది. సంతానం నుంచి దర్శకుడు, చిత్ర యూనిట్ అంతా తాజా సర్వర్‌సుందరం విషయంలో ప్రత్యేక దృష్టి చూపుతోందట. చిత్రాన్ని గోవాలో మొదలెట్టి దుబాయ్, చెన్నై, తంజావూర్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు.
ముఖ్యంగా దుబాయ్‌లో ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి సుందరమైన ప్రదేశాల్లో సర్వర్‌సుందరం చిత్ర షూటింగ్‌ను జూన్ వరకూ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. సంతానం తను ధరించే దుస్తుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందుకోసం దేశంలోని 15 మంది ప్రముఖ సర్వర్లను రప్పించి వారిని కన్సల్టెంట్‌లుగా నియమించుకుని దుస్తులు తదితర విషయాల్లో వారి సూచనలు, సలహాలతో చిత్రీకరణ జరపనున్నారట. చిత్ర దర్శకుడు ఆనంద్ బాల్కీ కూడా పూర్వం సర్వర్ కావడంతో ఈ సర్వర్‌సుందరం చిత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సంసిద్ధమయ్యారు. దీనికి సంతోష్ నారాయణన్ సంగీత బాణీలు కడుతున్నారన్నది గమనార్హం.