50 పైసలకే మొబైల్లో ఫేస్బుక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేస్బుక్, వాట్స్యాప్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఇకపై అతి తక్కువ ధరకే విహరించొచ్చు. ఇందుకోసం యూనినార్ తన ఇంటర్నెట్ సేవలను ఎంజీ, జీబీల నుంచి సర్వీస్ బేస్డ్ ఇంటర్నేట్ సేవలకు విస్తరించింది. ‘సబ్సే సస్తా(అన్నింటి కంటే చౌక) ఫేస్బుక్, సబ్సే సస్తా (అన్నింటి కంటే చౌక) వాట్స్యాప్’ పేర్లతో ప్రత్యేకమైన ఆఫర్లను గురువారమి క్కడ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్లోని యూనినార్ వినియోగదారులు గంటకు 50 పైసలు, రోజుకు రూ.1, వారానికి రూ.5, అలాగే నెలకు రూ.16 చార్జీలతో ఫేస్బుక్లో, అదేవిధంగా రోజుకు రూ.1, వారానికి రూ.5, నెలకు రూ.15 చార్జీలతో వాట్స్యాప్ సేవలను అన్లిమిటెడ్గా పొందవచ్చని’’ వివరించారు.
దీంతో వినియోగదారులు సోషల్ నెట్వర్కింగ్, బ్రౌజింగ్, ఈ-మెయిల్ కోసం ఇంటర్నెట్ సేవలను ఎంబీ, జీబీల్లో కాకుండా అన్లిమిటెడ్గా ఇంటర్నెట్ సేవలను పొందే అవకాశం ఉంటుందన్నారు. యూనినార్ వినియోగదారులు 4.6 మిలియన్లు ఉండగా ఇందులో 23% మంది డేటా సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం యూని నార్ వార్షిక ఆదాయంలో 11% వాటా డేటా సేవల వినియోగదారుల నుంచే వస్తోందని దీన్ని ఈ ఏడాదిలో రెట్టింపు చేయడమే లక్ష్యమని చెప్పారు. 85% మంది ఫేస్బుక్, వాట్స్యాప్ వంటి సోషల్ సైట్ల కోసం ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని, మొబైల్లో ఫేస్బుక్, వాట్స్యాప్లను వినియోగించే వారి సంఖ్య 12 %గా ఉందని సతీష్ చెప్పారు.