తల్లీబిడ్డపై నిర్లక్ష్య సేవ
అవస్థలు పడుతున్న బాలింతలు
సమయానికి అందుబాటులో ఉండని ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు
వాహనం కోసం సర్వజనాస్పత్రిలో రోజంతా నిరీక్షించిన ఓ బాలింత
అనంతపురం మెడికల్ : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయ్యాక బాలింతలను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమస్యను అధిగమించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 వేలకు పైగా ప్రసవాలు జరిగాయి. అయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందింది మాత్రం 13,800 మందికి మాత్రమే. ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి 5,480 మందికి, సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి 1,952 మందికి, పీహెచ్‌సీల నుంచి 2,329 మందికి, జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి 1945 మందికి, రెండు ఏరియా ఆస్పత్రుల నుంచి 2,105 మందికి సేవలందించారు.
సమయానికి రాదాయె!
ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత వైద్యులు డిశ్చార్జి తేదీ ప్రకటించగానే సంబంధిత ఆరోగ్య సిబ్బంది 102 సర్వీస్ కంట్రోల్ రూంకు స్వయంగా ఫోన్ చేసి ఫలానా బాలింతను ఫలానా తేదీన ఇన్ని గంటలకు పంపిస్తారంటూ వారికి సహాయంగా ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. కచ్చితంగా ఆ సమయానికి అందుబాటులో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ఆస్పత్రికి వెళ్లి బాలింతను ఇంటికి చేర్చాలి. ఈ సేవలన్నీ ఉచితమే. అయితే అమలులో ఆ పరిస్థితి లేదు. అనంతపురం సర్వజనాస్పత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, హిందూపురం, మడకశిర, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ధర్మవరం, శింగనమలలో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో లేకపోవడంతో చాలా పీహెచ్‌సీల్లో బాలింతలు సొంత ఖర్చుతోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.
ఒకేసారి డిశ్చార్జ్ చేస్తున్నారు
సర్వజనాస్పత్రిలో ఇబ్బందిగా ఉంది. రోజూ సాయంత్రం వేళ ఒకేసారి డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో అందరికీ వాహనం అందుబాటులో ఉంచలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లా.
– అంజన్‌రెడ్డి, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రోగ్రాం మేనేజర్ , అనంతపురం