ఆర్టీసీ బస్సు బోల్తా: పలువురికి గాయాలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం శివారు వెంగముక్కలపాలెం జంక్షన్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం వారిని స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
బస్సు ప్రమాదం నేపథ్యంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై బోల్తా పడిన బస్సును పక్కకు తీశారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.