మత్స్యకారుల విలవిల
రేపల్లె, న్యూస్‌లైన్ :ఈ ఏడాది వరుస విపత్తులతో సముద్రంలో వేట సాగక మత్స్యకారులు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 15వ నుంచి మే 31వ తేదీ వరకు వేట నిషేధం అనంతరం వేటకు అడుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురౌతున్నాయి. ఇటీవల పై-లీన్ తుపాను ప్రభావంతో సుమారు వారం రోజుల పాటు తీర పాంతంలో వేట నిలిచిపోయి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజాంపట్నం హార్బర్, లంకెవానిదిబ్బ, కొత్తపాలెం, హారీస్‌పేట ప్రాంతాల్లో సుమారు 150 మెక్‌నైజ్డ్ బోట్లు, సుమారు 700 మోటరైజ్డ్ బోట్లు నిలిచిపోయాయి. దీంతో మత్స్యకారులకు పూటగడవటమే కష్టంగా మారింది. తిరిగి ఇప్పుడిప్పుడే వేట సాగుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నామమాత్రంగానే బోట్లు వేటకు వెళ్తున్నాయి. సోమవారం ఎక్కువ శాతం బోట్లు హార్బర్‌లోనే నిలిచిపోయాయి.
కలుషిత జలాలతో ఇక్కట్లు..
సముద్రజలాలు కలుషితమవటంతో ఇప్పటికే వేటలో మత్స్య సంపద లభ్యత మందగించింది. ఒకప్పుడు సముద్ర తీరానికి అతి సమీపంలో వేట చేసే మత్స్యకారులు నేడు తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. దీనివల్ల అధిక శ్రమతో పాటు పెరుగుతున్న డీజిల్ ధరలు మరింత కృంగదీస్తున్నాయి.
ఉప్పు నిల్వలపై పట్టలు..
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు హార్బర్లోని మత్స్య సంపద, ఉప్పు నిల్వలను భద్రపరుచుకోవటంలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. హార్బర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఉప్పు నిల్వలపై పట టలు క ప్పారు.