పక్షి జాతులపై సర్వే
సాక్షి, ముంబై: బోరివలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్జీఎన్పీ) అధికారులు పక్షుల జాతులపై సర్వే నిర్వహించనున్నారు. ఈ నెల చివరన జరిగే సర్వేలో పార్కు సిబ్బంది, పక్షి శాస్త్రవేత్తలు, పక్షి ప్రేమికులు పాల్గొననున్నారు. ఈ అధ్యయనం పూర్తి అవడానికి కనీసం మూడు నెలల సమయం తీసుకునే అవకాశముందని ఎస్జీఎన్పీ డెరైక్టర్ వికాస్ గుప్తా తెలిపారు. పక్షుల వివరాలను సేకరించడం ద్వారా ఈ పార్కులో ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుస్తుందని, ఎడ్యుకేషన్ మెటీరియల్‌కు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రచారం కోసం సీతాకోక చిలుకలు, పక్షులు, పార్కులోని వృక్షజాతులపై కొత్త బుక్లెట్లను ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా నిర్వహించే ఈ అధ్యయనం తమకు ఎంతో దోహదకరంగా ఉంటుందన్నారు. పక్షి శాస్త్రవేత్తల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ప్రకృతి శాస్త్రవేత్త సంజయ్ మోంగా ఆధ్వర్యంలో బృందం 2011-12 మధ్య కాలంలో ఈ పార్కులోని పక్షులపై ప్రాథమిక అధ్యయనం చేశారు. వీరు తయారుచేసిన నివేదికను పార్కు పరిపాలన విభాగానికి కూడా సమర్పించారు. 251 పక్షి జాతులు ఉండగా, 155 సీతాకోక చిలుకల జాతులు, 40 జాతుల పాలిచ్చు జంతువులు, 800 రకాల జాతుల చెట్లు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈసారి అధ్యయనాన్ని వారాంతంలో, రాత్రి వేళ్లలో నిర్వహిస్తామని వికాస్ గుప్తా తెలిపారు. అన్ని రకాల పక్షులు ఒకే చోట చేరడానికి శీతాకాలం అనువైన కాలమని తెలిపారు.
పార్కులో భద్రత...
ఈ పార్కు ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద అత్యాధునిక కెమెరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం రిజల్యూషన్ తక్కువగా నమోదయ్యే కెమెరాలను కీలక ప్రదేశాలలో అమర్చారు. ఇవి వాహనం పార్కు లోపలికి ప్రవేశించిన సమయం, సందర్శకులు గడిపిన సమయం, నిష్ర్కమణ సమయం కూడా నమోదు చేస్తుంది. ఈ పార్కులో అత్యవసర సమయాల్లో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.