షేడ్‌నెట్స్‌కు ప్రోత్సాహం కరువు
ఒంగోలు : పంట దిగుబడులపై వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వర్షాకాలం, చలికాలంలోనే వివిధ పంటలు సాగవుతాయి. హరిత గృహల్లో కూరగాయలు, పూలు, సుగంధ, ఔషధ మొక్కలు పండించవచ్చు. ఎంతో ప్రయోజనకరమైన షేడ్‌నెట్స్ పథకం అమలకు సకాలంలో విధి, విధానాలు విడుదల చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఫలితంగా పథకాన్ని సద్వినియోగం చేసుకునే రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది సగం పూర్తయినా నేటికీ విధి, విధానాలు విడుదల చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు.
షేడ్‌నెట్స్ అంటే..
వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా పంటలు సాగయ్యే విస్తీర్ణం మేర షేడ్‌నెట్స్ నిర్మిస్తారు. దీని నీడ కింద పంటలు సాగవుతాయి. డ్రిప్ పద్ధతిలో కూడా వీటికింద సాగు చేసే పంటలకు నీరందించే అవకాశం ఉంది. కూరగాయల నారుమడి మధ్య క్రమపద్ధతిలో బోదెలు తీయడం (ప్లాంటింగ్ బెడ్స్) ఈ విధానంలో ముఖ్యమైంది. ఈ విధానంలో కూరగాయల సాగు పద్ధతి మంంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా షేడ్‌నెట్స్ శాశ్వత పద్ధతిలో ఇనుము,అల్యూమినియం పైపులపై పరారుణ కిరణాలు తట్టుకునే పాలిథిన్ షీటు కప్పి తుంపర్లు, బిందు సేద్యం ద్వారా పైర్లను సాగు చేస్తుంటారు. ఇంకా కర్రలపై షేడ్‌నెట్స్ పరిచి వాటికింద మిరప, క్యారెట్, కూరగాయలు, ఆకుకూరలు, నారుమడులు, పూల తోటలు సాగు చేయవచ్చు. తదితర కూరగాయలు, కొత్తిమీర వంటివి పండిస్తుంటారు. వాతావరణ పరిస్థితులను అధిగమించి ఎండకాలంలోనూ పాలిహౌజ్, షేడ్నట్స్ కింద పంటలు పండించడంతో అన్ సీజన్లో పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ప్రారంభం నుంచి పథకం అమలకు నిబంధనలు గుదిబండగా మారాయి. 50 శాతం రాయితీ ఇస్తున్నా.. ప్రభుత్వం విధించే నిబంధనలతో పాటు సకాలంలో విధి, విధానాలు విడుదల చేయకపోవడంతో పథకం ఆశించిన స్థాయిలో అమలకు నోచుకోవడం లేదు.
2014–15 ఆర్థిక సంవత్సరంలో..
జిల్లాలో ఉద్యాన శాఖ ఏడీ–1, 2 పరిధిలో 10 వేల చదరపు మీటర్లలో షేడ్‌నెట్స్ కింద పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. ఒక్కో రైతుకు అర ఎకర విస్తీర్ణంలో షేడ్‌నెట్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. 50 శాతం రాయితీ అమలులో ఉంది. ఒక రైతుకు రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం కల్పించే అవకాశం ఉంది. రైతులకు పూర్తిగా అవగహన లేకపోవడం.. ఉద్యాన అధికారులు రైతులకు అవగహన కల్పించకపోవడం పథకం ఆశించిన స్థాయిలో అమలకు నోచుకోలేదు. పథకం అమలులో విధి, విధానాలు సక్రమంగా పాటించలేదని అంతకుముందు ఏడాది రైతులకు రాయితీలు మంజూరు చేయలేదు. ఈ వివాదం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. షేడ్‌నెట్స్ వేసుకున్న రైతులు రూ.కోటి వరకు నష్టపోయారు.
గతేడాదీ కాలయాపనే..
గతేడాది షేడ్‌నెట్స్ నిర్మాణానికి రెండు వేల చదరపు మీటర్లు, రూ.60 లక్షల వరకు నిధులు కేటాయించారు. కొత్తగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ చాంతాడంత ఉండటంతో వాటిని చదివే తీరిక అధికారులకు లేకుండా పోయింది. నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలకు హజరవుతుండటంతో అప్పటి ఉద్యాన శాఖ అధికారి ఈ పథకాన్ని అటకెక్కించారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పథకం ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరలేదు. ఈ సంవత్సరం ఈ పథకం అమలకు ఉద్యానశాఖ ఏడీ–1 పరిధిలో రూ.9.20 లక్షల నిధులు కేటాయించారు. ఇంత వరకూ పథకం అమలకు విధి, విధానాలు ప్రభుత్వం విడుదల చేయలేదని ఉద్యాన శాఖ ఏడీ–1 ఎం.హరిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం విధి, విధానాలు విడుదల చేసిన వెంటనే రైతులకు ఈ పథకంపై అవగహన కల్పిస్తామని ఆయన వివరించారు.