మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: బద్వేలు పట్టణంలోని రాజుగారి వీధికి చెందిన షేక్ షఫి ఖమ్మం జిల్లాలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షేక్ మహబూబ్‌పీర్, తస్లీమ్ల రెండవ కుమారుడైన షఫి ఖమ్మంలోని మమతా మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ప్రొద్దుటూరుకు చెందిన నజ్మాతో 10 నెలల క్రితం వివాహం జరిగింది. భార్య కూడా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు.
వీరిద్దరు మమతా రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు. అయితే నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో భార్యను ప్రొద్దుటూరుకు పంపి షఫి ఒక్కడే ఇంట్లో ఉంటుండేవాడు. షఫికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి నజ్మా తన స్నేహితురాలిని అపార్ట్మెంటుకు పంపడంతో షఫి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి బద్వేలులోని తల్లిదండ్రులకు కూడా విషయం చేరవేశారు. దీంతో వారు హుటాహుటిన ఖమ్మం వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం బద్వేలుకు తీసుకువచ్చి ఖననం చేశారు. షఫి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.