ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ సేవలకు సంబంధించి టెలికం స్పెక్ట్రం వేలాన్ని ఈ ఏడాదే నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే వచ్చే 100 రోజుల్లో 5జీ ట్రయల్స్ కూడా ప్రారంభించాలని భావిస్తోంది. కొత్తగా టెలికం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రవి శంకర్ ప్రసాద్ సోమవారం ఈ విషయాలు తెలిపారు. ‘స్పెక్ట్రం వేలంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు సమర్పించింది. స్థాయీ సంఘం, ఆర్థిక కమిటీ మొదలైనవి పరిశీలిస్తున్నాయి. ఒక నిర్ణయానికొచ్చాక ప్రతిపాదన క్యాబినెట్ ముందుకొస్తుంది. ప్రస్తుతానికి తగినంత స్పెక్ట్రం అందుబాటులో ఉంది. ఈ ఏడాదే వేలం కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నాను‘ అని మంత్రి తెలిపారు. 5జీ సేవలకు కూడా ఉపయోగపడే 8,644 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయొచ్చని ట్రాయ్ సూచించింది. దీనికి మొత్తం బేస్ ధర రూ.4.9 లక్షల కోట్లుగా నిర్దేశించవచ్చని పేర్కొంది. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తాము ఇంత భారీ రేటును భరించలేమంటూ టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మార్కెట్‌ను ప్రతిబింబించే సూచీ ..
100 రోజుల్లో 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించడంతో పాటు దేశీయ మార్కెట్లో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే బ్రాడ్‌బ్యాండ్ సంసిద్ధత సూచీని (బీఆర్ఐ) ఏర్పాటు చేయడం కూడా మంత్రి ఎజెండాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇన్ఫ్రా, అనుమతుల ప్రక్రియ, హై స్పీడ్ ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలను బీఆర్ఐ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే అయిదు లక్షల వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, దేశీయంగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించడం వంటి వాటిపైనా దృష్టి పెట్టనున్నారు. ‘అణగారిన వర్గాల సంక్షేమానికి, విద్య .. వైద్యం వంటి వాటిని మెరుగుపర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సాంకేతికతను చేరువ చేసేందుకు 5జీ టెక్నాలజీని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, 5జీ ట్రయల్స్‌లో చైనా కంపెనీ హువావేని కూడా అనుమతించే విషయంపై స్పందిస్తూ.. ఇది భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున.. మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని యన చెప్పారు.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేయనివ్వొద్దు
ఉగ్రవాదం, మతతత్వాలకు సోషల్ మీడియా వేదిక కాకూడదని రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా సైట్లు దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డేటా భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో 10 నగరాల్లో ఆధార్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు.