shankarpally
-
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
చాటింగ్ తెచ్చిన రగడ
శంకర్పల్లి: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా , శంకర్పల్లి మండలం, దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. (చదవండి: పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు) -
హైదరాబాద్‌లో కొత్త పోలీస్స్టేషన్లు.. ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దశాబ్ద క్రితం వరకూ శివారు ప్రాంతాలు అనుకున్నవన్నీ నేడు ప్రధాన నగరంలో కలిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డును దాటేసి.. రీజినల్ రింగ్ రోడ్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో అదే స్థాయిలో శాంతి భద్రతలను కల్పించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్‌లో కొత్తగా నాలుగు ఠాణాలు, రాచకొండలో ఒక డివిజన్, పీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేది జనాభా, నేరాల సంఖ్యను బట్టి ఉంటుంది. ఐటీ కంపెనీలతో పశ్చిమ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ తదితర ప్రాంతాలు నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతలను పెంచాల్సిన అవసరం ఉందని ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సైబరాబాద్‌లో నాలుగు పీఎస్‌లు.. సెబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దేశంలో లక్ష జనాభాకు 138 మంది పోలీసులు ఉండగా.. సైబరాబాద్‌లో 86 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు, 9 డివిజన్లలో 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్ డివిజన్లోని నార్సింగి, మియాపూర్ డివిజన్లోని ఆర్సీపురం, చేవెళ్ల డివిజన్లోని శంకర్పల్లి పీఎస్‌ల పరిధిని కుదించి.. ఆయా ప్రాంతాలతో పాటూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలిపి కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో నార్సింగి పీఎస్‌లోని గండిపేట, మెకిల్ల.. ఆర్సీపురం పీఎస్‌లోని కొల్లూరు, శంకర్పల్లి పీఎస్‌లోని జన్వాడ పేరిట కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రధాన నగరంలోని పోలీస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటూ నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు. 2 నుంచి 3 వేల పోలీస్ సిబ్బంది కూడా.. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటూ కొత్తగా రానున్న వాటిల్లో పోలీసుల నియామం చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు సమాచారం. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అదనంగా 2–3 వేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌కు 9,403 మంది సిబ్బంది మంజూరు కాగా.. ప్రస్తుతం అన్ని ర్యాంక్‌లలో కలిపి 6,599 మంది సిబ్బంది ఉన్నారు. 2,804 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. (ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?) రాచకొండలో కొత్త డివిజన్, పీఎస్.. 5,091.48 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న రాచకొండ ఏరియా వారీగా దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్. రాచకొండలో అత్యధిక జనాభా ఉన్న ఎల్బీనగర్ జోన్ నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త డివిజన్, పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న నాగోల్‌ను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎల్బీనగర్ జోన్‌లోని వనస్థలిపురం డివిజన్‌ను విభజించి ప్రత్యేకంగా బాలాపూర్ పోలీస్ డివిజన్ ఏర్పాటు కానుంది. వనస్థలిపురంలోని డివిజన్లోని కొన్ని ప్రాంతాలను, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లతో పాటు, ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లను కలుపుకొని కొత్తగా బాలాపూర్ డివిజన్ ఏర్పాటు కానుంది. (చదవండి: హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు) -
విద్యార్థిపై టీచర్ కర్కశం.. ఉమ్ము కింద పడిందని...
సాక్షి,శంకర్పల్లి: తరగతిగదిలోకి వచ్చేందుకు అనుమతి అడుగుతుంటే నోట్లో నుంచి ఉమ్ము కింద పడిందని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిపై కర్కశం ప్రద ర్శించారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు, లత దంపతుల కుమారుడు సంజీవ్‌కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చదవండి: అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు శ్వేతను అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. దీంతో ఆగ్రహించిన ఆమె కర్రతో చితకబాదారు. చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో చర్మం కమిలిపోయింది. సాయంత్రం ఇంటికి వచి్చన బాలుడి ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టీచర్‌ను నిలదీయగా.. మీ అబ్బాయికి క్రమశిక్షణ లేదు అందుకే కొట్టానని బదులిచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. సస్పెన్షన్ వేటు విద్యార్థి సంజీవ్‌కుమార్‌ను చితకబాదిన ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతపై డీఈవో సుశీందర్‌రావు గురువారం వేటు వేశారు. -
పెళ్లి దుస్తుల్లోనే విగతజీవిగా ప్రవళిక.. పాడె మోసిన ఎమ్మెల్యే ఆనంద్
సాక్షి, వికారాబాద్: వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటనతో మోమిన్‌పేట, రావులపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. మోమిన్‌పేటకు చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవళికను మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం తమ బంధువులతో కలిసి మోమిన్‌పేటకు వచ్చిన నవాజ్‌రెడ్డి విందు ముగించుకుని సాయంత్రం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంత చెప్పినా వినకుండా కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు రెండో సోదరి శ్వేత మృతిచెందారు. బాలుడు శశాంక్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే.. పెళ్లి కారు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వాగు ప్రవాహం, బురద నీటిలో నాలుగు కిలోమీటర్లు నడిచారు. వధవు ప్రవళిక, పెళ్లి కొడుకు అక్క శ్వేత మృతదేహాలు దొరకడంతో స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోమిన్‌పేటలో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవళిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నవ వధువు తల్లిదండ్రులు రోధించిన తీరు కలచివేసింది. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సబితా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని, రావులపల్లిలో వరుడు నవాజ్ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమెతోపాటు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ ఉన్నారు. అదే విధంగా శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు పడే సమయంలో రోడ్లపై, కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. డ్రైవర్ బతికే ఉండు.. వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడ్డాడని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మర్పల్లి పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కిలోమీటర్ దూరం వెళ్లి, చెట్టు కొమ్మలకు తట్టుకుని ఆగిందన్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారులో నుంచి నీటిలో దూకి, ఈదుకుంటూ వెళ్లి రెండు గంటల పాటు చెట్టు కొమ్మలు పట్టుకుని ఉన్నాడన్నారు. వరద తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భయపడి అదే రాత్రి అంరాద్కుర్దు గ్రామానికి వెళ్లి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాఘవేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడి దుర్మరణం మోమిన్‌పేట మండల పరిధిలోని ఏన్కతలకు చెందిన శామల వెంకటయ్య(60) ఆదివారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయిలతో కలిసి కారులో కౌకుంట్లకు బయలుదేరారు. తిరిగి వచ్చే క్రమంలో శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో శ్రీనివాస్, సాయి ప్రాణాలతో బయటపడగ వెంకటయ్యమృతి చెందాడు. సోమవారం ఏన్కతలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
అప్పుడు రక్షించాడు.. ఇప్పుడు వేధిస్తున్నాడు.. చివరికి
సాక్షి, సిటీబ్యూరో: శంకర్పల్లి మండలం పిల్లిగుండ్లకు చెందిన జంగంపేట ప్రసాద్‌రెడ్డి గతంలో ఓ విద్యార్థినిని తోటి విద్యార్థి వేదింపుల నుంచి కాపాడాడు. ఆ ఘటనతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమ పేరిట సదరు విద్యార్థినిని తానే వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ప్రసాద్‌రెడ్డి వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ప్రసాద్‌రెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చదవండి: Cyber Crime: ఫోన్లోనే పరిచయం, చాటింగ్.. అమెరికా వెళ్దామని.. -
అన్నపూర్ణగా తెలంగాణ
శంకర్పల్లి : రానున్న రోజుల్లో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురంలో ఆదివారం రైతులకు బీమా బాండ్లను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. 65 ఏళ్లు పాలించిన నేతలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలో సాధించి చూపించామని అన్నారు. త్వరలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.12 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గతంలో రైతులు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా చితికిపోవడమే తప్పా లాభం ఉండేది కాదని, నేడు రైతులు పండించిన పంటలను సర్కారు మద్దతు ధరకు మార్కెట్లో కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు పెట్టుబడికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 60 కోట్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 74 వేల కోట్లకు చేరుకుందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రకటించారని తెలిపారు. గతంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఎవరి భూమి ఎంత ఉందోననే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, తద్వారా రైతులందరికీ మేలు కలిగిందన్నారు. రాబోయే రైతులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సమస్యలు పరిష్కారయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే కుటుంబానికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుభీమా పథకాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల మేలుకోసమేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మందికి, చేవెళ్ల నియోజకర్గంలో 35,601మంది రైతులకు బీమా బాండ్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు గోవిందమ్మగోపాల్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఆశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గోపాల్, వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం త్రుటిలో తప్పింది. పుణె నుంచి సికింద్రాబాద్ వస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రమాదవశాత్తు ఓ క్రేన్ ఢీకొంది. దాంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. శంకర్పల్లి రైల్వేస్టేషన్లో సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా అక్కడ ఆ పనుల కోసం క్రేన్‌ను ఉంచారు. ఇదే రైలును ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అంతా సురక్షితంగా ఉన్నారు. -
శుభలేఖలు పంచేందుకు వెళ్తూ..
శంకర్పల్లి: చెల్లెలి వివాహ శుభలేఖలు పంచేందుకు వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. పెళ్లింట విషాదం నెలకొన్న ఈ ఘటన సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిమండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాజ్‌పేట్ అనుబంధ గోపులారం గ్రామానికి చెందిన మధు(26) పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. ఇతడి చెల్లెలు పెళ్లి వచ్చే నెల 4 ఉంది. వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మధు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బంధువులకు శుభలేఖలు ఇచ్చేందుకు స్నేహితుడు రాముతో కలిసి బైక్‌పై పటాన్‌చె రు వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో బీడీఎల్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను వీరి వాహనం ఢీకొంది. ప్రమాదంలో మధు రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రగాయాలై రక్తస్రావమవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ వెనకాల కూర్చున్న రాము కూడ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో రెండు బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. రాము పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మధు మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మయ్య, సబిత, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన అతడి మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకున్నారు. మృతుడికి ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నాడు. త్వరలో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుందని స్థానికులు తెలిపారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.