Shar Center
-
చంద్రయాన్-3 దేశ అంతరిక్ష చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది: ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: చందమామను ఇక్కడి నుంచి చూస్తూ మనకు తెలిసిన ఎన్నో కథలను చెప్పుకున్నాం. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆ వెన్నెల రాజ్యాన్ని శోధించాలని తపన మానవవాళిలో మొదలైంది. ఈ క్రమంలో కొన్ని అగ్రరాజ్యాలు చకచకా వెళ్లి జెండాలు పాతి వచ్చినా.. చంద్రుని పూర్తి గుట్టు మాత్రం విప్పలేకపోయాయి. వాటితో పోలిస్తే జాబిల్లిపై పరిశోధనలను భారత్ కాస్త ఆలస్యంగా ప్రారంభించినా అద్భతాలను చేయాలని ప్రయత్నిస్తోంది. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023న బంగారు అక్షరాలతో లిఖించనుంది. చంద్రయాన్-3, మన మూడవ చంద్ర మిషన్, మరికాసేపట్లో దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశపు ఆశలు, కలలను ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్ చేశారు. 14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES — Narendra Modi (@narendramodi) July 14, 2023 చదవండి: Himachal Pradesh Floods: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం..
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 10న ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఈ నెల 9న లాంచ్ రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు వారికి అప్పగిస్తారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–01, ఆజాదీశాట్–02 అనే మూడు చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
26న పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ54) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960 కేజీల బరువు కలిగిన ఓషన్‌శాట్–3 (ఈవోఎస్–06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. భారత్‌కే చెందిన తైబోల్ట్–1, తైబోల్ట్–2, ఆనంద్, ఇండియా–భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్ఎస్–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్ –2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. -
ప్లాటినం షార్, శాస్త్రవేత్తల సంబురాలు
సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీ.. చంద్రయాన్-1, మంగళ్యాన్ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్‌యాన్‌కు సమాయత్తమవుతోంది. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల వివరాలను ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్‌డౌన్ స్టార్ట్
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ–48
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ–48 ఉపగ్రహ వాహక నౌక బుధవారం సాయంత్రం 3.25 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్రో చైర్మన్ కె.శివన్ సమక్షంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇది ఇస్రోకు చరిత్రాత్మక ప్రయోగమన్నారు. -
నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో
ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. ప్రపంచ దేశాలన్నీ సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ వైపే చూశాయి. ఈ ప్రయోగాన్ని వీక్షించేం దుకు దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ కూడా వచ్చారు. ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దేశమంతా మేల్కొని ప్రయోగాన్ని చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో చంద్రయాన్–2 నింగికి పయనమయ్యేది.. కానీ క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. అందరితో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు సైతం నిరాశ చెందారు. ఇక ప్రయోగానికి రెండు నెలల సమయం పడుతుందనుకున్నారు. శాస్త్రవేత్తలు వెంటనే తేరుకున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే సమస్యను సరిచేశారు. రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 22వ తేదీన సగర్వంగా చంద్రయాన్–2ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగాల్లో ఇస్రోది తిరుగులేని ఆధిపత్యం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జీఎస్ఎల్వీ రాకెట్లను సైతం విజయవంతంగా నింగికి పంపుతోంది. ఇందులో క్రయోజనిక్ దశ కీలకమైంది. తొలినాళ్లలో రష్యా నుంచి తెచ్చిన క్రయోజనిక్ ఇంజిన్ల సహకారంతో జీఎస్ఎల్వీని ప్రయోగించేది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజిన్లు తయారు చేసే విషయంలో ఇస్రో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ 13 జీఎస్ఎల్వీలు ప్రయోగించగా అందులో 7 స్వదేశీ ఇంజిన్లు ఉండడం గమనార్హం. ఇందులో ఒకటి మాత్రమే విఫలమైంది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ల సిరీస్‌లో మూడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 2010 ఏప్రిల్ 5వ తేదీన తొలిసారిగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం విఫలమైంది. అందులో జరిగిన లోపాలపై 2010 నుంచి 2013 దాకా అధ్యయనం చేసింది. లోపాలను సరిదిద్ది అదే సంవత్సరం ఆగస్టు 19న జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగానికి సిద్ధమైంది. ఆ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభించి మరో గంటలో ప్రయోగం ఉందనగా రెండోదశలో లీకేజీని గుర్తించి ప్రయోగాన్ని ఆపేసింది. అది మేజర్ సాంకేతిక లోపం కావడంతో రాకెట్‌లోని ఇంధనాన్ని అంతా వెనక్కి తీయడమే కాకుండా రాకెట్‌ను పూర్తిగా విప్పేసి రెండో దశలో లీకేజీ వచ్చిన చోటును గుర్తించి నాలుగు నెలల్లో అంటే 2014 జనవరి నెలలో ప్రయోగాన్ని చేసి విజయవంతంగా గగనంలోకి పంపింది. ఆ తరువాత చేసిన జీఎస్ఎల్వీ ప్రయోగాలన్నీ విజయవంతం కావడం విశేషం. ప్రయోగానికి సిద్ధం తాజాగా చంద్రయాన్–2 మిషన్‌ను తీసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్లో మూడో దశలోని క్రయోజనిక్ దశలో పోగో గ్యాస్బాటిల్స్ నుంచి ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయటవైపు లీకేజీని గుర్తించి 56.24 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. కేవలం నాలుగు రోజుల్లోపే అంతా సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. అయితే ముందుగా సెప్టెంబర్ నెల వరకు పడుతుందని, ఈ ఏడాది ఆఖరు దాకా సమయం తీసుకుంటుందని అనుకున్నారు. శాస్త్రవేత్తలు దీనిని సవాలుగా తీసుకుని తక్కువ సమయంలో మరమ్మతులు చేశారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని ఈ నెల 22న సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. -
చంద్రయాన్–2లో మనోడు..
సిద్దిపేట జోన్/సిద్దిపేట రూరల్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్ పాత్ర ఉండటం తెలంగాణకు గర్వకారణం. సురేందర్ గత 20 ఏళ్లుగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో స్పేస్ వెహికిల్స్ రాడార్ కమ్యూనికేషన్, టెలి కమాండ్ సిస్టం, ఎలక్ట్రికల్ సిస్టంతో పాటు పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిద్దిపేటలోని చేనేత కుటుంబంలో జన్మించిన సురేందర్ కష్టాలను సహవాసంగా స్వీకరిస్తూ అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదిగారు. తల్లి దండ్రులు వీరబత్తిని సత్తయ్య, రాజమణిలకు ఉన్న ముగ్గురు కుమారుల్లో రెండో వాడు సురేందర్. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి రాజమణి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుమారులను ప్రయోజకులుగా చేశారు. సురేందర్ విద్యార్థి దశ నుంచే గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. 10వ తరగతి అనంతరం నిజా మాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో చదివారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (రాంచీ)లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. శాస్త్రవేత్తగా ఎదగాలన్న ఆశయంతో కొత్తగూడెం ఏపీ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా, పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 20 ఏళ్ళుగా... ఈసీఐఎస్లో పనిచేస్తున్న క్రమంలోనే సురేందర్‌కు శ్రీహరికోట స్పేస్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. 2000లో షార్‌లో చేరిన సురేందర్ అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపే ప్రతి ప్రక్రియలో భాగస్వాముడిగా మారారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ లాంటి ప్రయోగాల్లో కూడా తనవంతు పాత్ర నిర్వర్తించారు. చాలా ఆనందంగా ఉంది.. ‘నా బిడ్డ సురేందర్ మొండివాడు.. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని కచ్చితంగా చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాం. కష్టపడి చదువుకునే మనస్తత్వం కలిగిన నా కొడుకు గురించి ఇప్పుడు పేపర్లో, టీవీల్లో వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తల్లి దండ్రులుగా మాకు ఇంతకంటే ఏమి కావాలి. దేశం కోసం సేవ చేస్తున్న కుమారుడుని చూస్తే కడుపు నిండుతోంది’అంటూ సురేందర్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
రాష్ట్రానికి రాష్ట్రపతి దంపతుల రాక
సాక్షి, నెల్లూరు(పొగతోట): భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ దంపతులు ఈ నెల 14వ తేదీన షార్కు రానున్నారు. శ్రీహరికోట నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతితోపాటు ఆయన సతీమణి కూడా షార్కు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు శ్రీహరికోట చేరుకుంటారు. ప్రయోగం వీక్షించిన తర్వాత 15వ తేదీ రాష్ట్రపతి తిరుగు ప్రయాణమవుతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి దంపతుల రాక సందర్భంగా సోమవారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్టపతి దంపతులు ఈ నెల 14వ తేదీ సాయంత్రం షార్కు వస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంకి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన మందులు అంబులెన్స్‌తో సిద్ధంగా ఉంచాలన్నారు. షార్‌లోని ఆస్పత్రిలో అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలను డీఆర్డీఓకు అందజేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 12వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, డీఆర్ఓ సి.చంద్రశేఖరరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, విద్యుత్‌శాఖ ఎస్ఈ విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, నెల్లూరు : జీఎస్ఎల్వీ -ఎఫ్8 రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డా.శివన్ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్‌డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్8 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం. -
పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ 25 రాకెట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎల్లుండి మధ్యాహ్నం 2.38 నిమిషాలకు ఆ రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది. అంటే 56.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రూ.450 కోట్లను పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ ప్రయోగం కోసం ఇస్రో వెచ్చించింది. ఇప్పటి వరకు 25 పీఎస్ఎల్వీ రాకెట్లను షార్ నుంచి ఇస్రో ప్రయోగించింది. అయితే 23 పీఎస్ఎల్వీలు మాత్రమే విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ ప్రయోగం ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి పంపనుండటం తెలిసిందే. -
జీఎస్ఎల్వీ ప్రయోగానికి 18న కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: షార్ కేంద్రం నుంచి ఈనెల 19న సాయంత్రం 4.50 గంటలకు జరగనున్న జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను 18వ తేదీ 11.50 గంటలకు ప్రారంభించనున్నట్లు షార్ డెరైక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ చెప్పారు.18.30 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసేలా డిజైన్ చేశామన్నారు. శుక్రవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి లాంచ్ రిహార్సల్ పూర్తి చేస్తామన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల షార్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రయోగం ద్వారా 1985 కిలోల బరువున్న జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఇస్రో విశిష్ట పురస్కారం: షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌కు ఇస్రో విశిష్ట పురస్కారం లభించింది. ఇస్రోలో పనిచేస్తున్న వారిలో మూడో విశిష్ట వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ డెరైక్టర్ కె. కిరణ్‌కుమార్ విశిష్ట వ్యక్తులుగా గుర్తింపు సాధించారు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌కు మూడో విశిష్టవ్యక్తిగా పురస్కారం లభించింది.