Shaurya Diwas
-
హిందూ సంస్థల శౌర్య దివస్.. ముస్లింల విషాద దినం
అయోధ్య / లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేతకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ‘శౌర్య దివస్’ పేరిట సంబరాలు నిర్వహించగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వంటి ముస్లిం సంస్థలు ‘విషాద దినం’గా పాటించాయి. అయోధ్యతో పాటు ఫైజాబాద్‌లో భారీసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. వీహెచ్‌పీ ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల సంబరాలు నిర్వహించింది. మందిరం నిర్మాణానికి ప్రస్తుతం దేశంలో పరిస్థితి అనుకూలంగా ఉందని శ్రీరామ్ జన్మభూమి న్యాస్ చైర్మన్ మహంత్ గోపాల్‌దాస్ చెప్పారు. బాబ్రీ కూల్చివేత ఘటనలో లిబర్హాన్ కమిషన్ దోషులుగా తేల్చిన వారందరికీ కఠిన శిక్ష విధించాలని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు రషీద్ డిమాండ్ చేశారు. -
లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. తర్వాత ఓ స్టూలు ఎక్కి , పైకప్పు గుండా బయటపడ్డారు. రాజ్‌నాథ్ గురువారం ‘శౌర్య దివస్’లో పాల్గొనేందుకు ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ భవన సముదాయానికి వచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి తొలి అంతస్తులోని ఆడిటోరియానికి లిఫ్టులో వెళ్తూ అందులో చిక్కుకుపోయారు. తనతోపాటు లిఫ్టులో చిక్కున్న తన ఓఎస్డీ బీకే సింగ్, హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదురి, సీఆర్పీఎఫ్ చీఫ్ ప్రకాశ్ మిశ్రాలను ఖాళీ చేయించడానికి తానే చొరవ తీసుకున్నానని ఆయన తర్వాత జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ‘బయటికి రావడానికి స్టూలు ఎక్కాల్సి వచ్చింది. తొలుత సీఆర్పీఎఫ్ డీజీ, తర్వాత చౌదరి బయటికి రావాలని, అందరినీ ఖాళీ చేయించాకే నేను రావాలని నిర్ణయించాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలని, మంచి ఆలోచనలతో పని చేయాలని’ అని చెప్పారు.