జీవితం...ఒక జైలు... స్వేచ్ఛ కోసం ఆరాటం!
అందుకే... అంత బాగుంది!
ది షాషాంక్ రిడెంప్షన్ (1994)
హాలీవుడ్
తారాగణం: టిమ్ రాబిన్స్, మోర్గాన్ ఫ్రీమన్, బాబ్ గుంటన్, విలియమ్ శాడ్లర్
దర్శకుడు: ఫ్రాంక్ డారాబాంట్ ; ఛాయాగ్రహణం: రోజర్ డీకిన్స్
విడుదల తేదీ: 1994 సెప్టెంబర్ 10 ; సినిమా నిడివి: 142 నిమిషాలు
నిర్మాణ వ్యయం: 2.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 150 కోట్లు)
సుకుమార్
ప్రముఖ సినీ దర్శకుడు
‘‘ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ సినిమా చూశావా?’’...
నా ఫ్రెండ్ దర్శక - రచయిత వేమారెడ్డి నన్ను అడగడం అది అయిదోసారి.
అప్పటికే చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విన్నాను.
కానీ, అంత గొప్పదనం ఏముందా సినిమాలో?
నా మనసులో ఏవో ప్రశ్నలు... సందేహాలు... నాకు నేనే చెప్పుకొంటున్న సమాధానాలు... అవన్నీ ఎందుకు? సినిమా చూసేస్తే పోలా అనిపించింది. ఆ రాత్రి సినిమా చూడడం మొదలుపెట్టా. సినిమాలో దాదాపుగా అన్ని సీన్లూ జైల్లోనే!
అరగంట తర్వాత ఆపేశా... ఎందుకో చూడబుద్ధేయలేదు!
హీరో మహేశ్‌బాబుతో ‘1... నేనొక్కడినే’ సినిమా హడావిడిలో పడి, మళ్లీ దాని జోలికి వెళ్లలేదు. ‘1’ సినిమా రిలీజయ్యాక కొంచెం తీరిక దొరికి, ఎందుకో ఇంటర్నెట్లో ‘ఐఎండిబి’ వెబ్సైట్ ఓపెన్ చేశా. ‘ఐఎండిబి’ అంటే ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’. ప్రపంచ సినిమాలకు సంబంధించిన సమస్త సమాచారమూ అందులో ఉంటుంది. అందుకే రోజూ కోటిన్నర మందికి పైగా ఈ సైట్‌ను వీక్షిస్తుంటారు. ఈ సైట్లో అత్యుత్తమమైన హాలీవుడ్ సినిమాలంటూ 250 సినిమాల లిస్ట్ ఉంది. ఆ జాబితాలో మొదటి పేరు- ‘ది షాషాంక్ రిడెంప్షన్’.
1998 నుంచి ఇప్పటివరకూ ఈ సినిమాదే నంబర్ వన్ ప్లేస్. నన్ను వదిలిపెట్టకుండా వెంటాడుతున్న అదే పేరు... అదే సినిమా!ఆ సినిమా వివరాలన్నీ చదివాక, మళ్ళీ నా మనసు ‘ది షాషాంక్ రిడెంప్షన్’ మీదకు మళ్ళింది. ఈసారి ‘ది షాషాంక్ రిడెంప్షన్’ చూడకుండా ఉండలేకపోయా.ఈసారి చూస్తూ చూస్తూ నన్ను నేను మరిచిపోయా. ఇన్నేళ్లూ ఈ సినిమా చూడనందుకు నన్ను నేనే తిట్టుకున్నా. నాలో ఏవేవో ఊహలు... భావోద్వేగం రెక్కలు తొడిగి, రివ్వున పైకి ఎగిరింది. ఈ సినిమా నాలో పాజిటివ్ ఎనర్జీ నింపింది. అప్పటి వరకూ నేను వర్రీలుగా భావించినవన్నీ ఒక్కసారిగా దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
జీవితానికి ఇలాంటి ఒక్క సినిమా తీస్తే చాలు కదా అనిపించింది. ఆ అనిపించడంలో తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే - ఈ సినిమాను ఇంకోసారి చూస్తే వెంటనే కాపీ కొట్టి సినిమా తీసేయాలనిపిస్తుంది. కానీ ఈ సినిమాలా తీయడం కష్టం... చాలా కష్టం.అంతెందుకు! ఈ సినిమా సృష్టికర్త ఫ్రాంక్ డారాబాంట్కే అసాధ్యం. ఆయన అంతకు ముందూ గొప్ప సినిమాలు తీయలేదు. ఆ తర్వాతా తీయలేదు. ‘కొన్ని అద్భుతాలు... అలా జరుగుతాయి. అంతే!’ అన్నట్టుగా తెర మీద జరిగిన ఒక అద్భుతం ఈ సినిమా.
చిత్రమేమిటంటే - ఈ సినిమాకు ఆధారం ఓ చిన్న నవలిక.
అమెరికాలో స్టీఫెన్ కింగ్ అని ఓ రచయిత ఉన్నాడు. అతను ‘డిఫరెంట్ సీజన్స్’ పేరుతో కొన్ని కథలు కలిపి ఓ పుస్తకం వేశాడు. అందులో ఓ చిన్న నవలిక - ‘రీటా హేవర్త్ అండ్ ది షాషాంక్ రిడెంప్షన్’. ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం లియో టాల్‌స్టాయ్ రచన ‘గాడ్ సీస్ ది ట్రూత్... బట్ వెయిట్స్’ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు. అప్పట్లో తాను రాసిన కథలను సినిమాలుగా తీస్తే, ఒక్కో కథను ఒక డాలర్‌కే హక్కులు ఇచ్చేస్తానని రచయిత స్టీఫెన్ కింగ్ ప్రకటించాడు. అది చూసి ఫ్రాంక్ డారాబాంట్ 1983లో ‘ది ఉమన్ ఇన్ ది రూమ్’ అనే కథ తాలూకు హక్కులు తీసుకుని సినిమా తీశాడు. మళ్లీ 1987లో ‘రీటా హేవర్త్ అండ్ ది షాషాంక్ రిడెంప్షన్’ నవలిక హక్కులు అడిగితే, అతని మీద మంచి అభిప్రాయం ఉండడంతో స్టీఫెన్ వెంటనే హక్కులు ఇచ్చేశాడు.ఆ కథ మీద కూర్చుని ఫ్రాంక్ డారాబాంట్ రెండు నెలల్లో సినిమా స్క్రిప్ట్ తయారు చేశాడు. అలా ‘ది షాషాంక్ రిడెంప్షన్’ మొదలైంది.
కథ ఏమిటంటే...
ఆండీ డూఫ్రెస్నే అనే బ్యాంకర్ ఉంటాడు. అతని భార్యను, ఆమె ప్రియుణ్ణి హత్య చేశాడనే ఆరోపణ మీద కోర్టు ఆండీకి తప్పుగా ఖైదు శిక్ష విధిస్తుంది. అదీ ఒకటి కాదు... ఏకంగా రెండు జీవితకాలపు జైలుశిక్షలు. ఆండీని ‘షాషాంక్’ అనే జైలుకు తరలిస్తారు. కరడుగట్టిన నేరస్థులంతా ఉంటారక్కడ. వాళ్ల మధ్య ఆండీ ప్రత్యేక వ్యక్తిత్వంతో కనబడతాడు. ఆండీకున్న బ్యాంకింగ్ నైపుణ్యం గురించి తెలుసుకున్న జైలు వార్డెన్ శామ్నోర్టాన్ తన అవినీతి వ్యవహారాలకు ఇతణ్ణి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆండీని నిర్దోషిగా రుజువు చేసే సమాచారం తన దగ్గర ఉందని జైలుకి కొత్తగా వచ్చిన టామీ అనే ఖైదీ చెబుతాడు. కానీ, టామీని జైలు వార్డెన్ చంపించేస్తాడు. ఎందుకంటే ఆండీ జైలు నుంచి వెళ్లిపోవడం వార్డెన్‌కు ఇష్టం ఉండదు.
చివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆండీ జైలు నుంచి సొరంగం తవ్వుకుని, మెక్సికో పారిపోతాడు. అక్కడ నుంచీ జైలు వార్డెన్ మోసాలు బయటపెడతాడు. దాంతో వార్డెన్ ఆత్మహత్య చేసుకుంటాడు. జైలులో స్నేహితుడైన రెడ్ను విడిపించి, ఆండీ స్వేచ్ఛగా, కొత్తగా జీవితం ప్రారంభిస్తాడు. చాలా సామాన్యమైన కథలా అనిపిస్తుంది కానీ, ఇందులో అసామాన్యమైన విషయాలు ఉన్నాయి. ఆండీ పాత్ర కూడా చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ నిలువెత్తు ఆత్మవిశ్వాసానికీ, ఆశావాదానికీ ప్రతీకలా అనిపిస్తాడు. ఒక్కరోజు స్వేచ్ఛ కోసం ఎన్నేళ్లు కష్టపడ్డా ఫరవాలేదనుకునే మనస్తత్వం అతనిది.
రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కూడా ఎక్కడా నిరాశకు లోను కాడు. తనకున్న మేధతోపాటు, ఓపికతో, భవిష్యత్తు పట్ల ఆశతో... రోజూ కొద్ది కొద్దిగా చొప్పున జైలులో నుంచి సొరంగం తవ్వడం మొదలుపెడతాడు. అక్కణ్ణుంచీ సొరంగం తవ్వి బయట పడాలంటే సుమారు 20 ఏళ్లు పడుతుంది. అయినా రోజూ ఓపిగ్గా తవ్వుతూనే ఉంటాడు. అది కూడా మూడో కంటికి తెలియకుండా! మనమేమో వారం రోజులు కష్టపడితే, మంచి జరుగుతుందంటేనే, ‘అమ్మో... వారం రోజులా’ అంటాం. ఓపిక పట్టలేం. అలాంటిది 20 ఏళ్లు జైలు నుంచి సొరంగం తవ్వడమంటేనే, అతని ఆశావాదం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఆండీ జైలు నుంచి తప్పించుకునే సన్నివేశం చూస్తుంటే, చిన్నపిల్లాడిలా చప్పట్లు కొట్టేస్తాం. చలం చిన్న వాక్యంలో చెప్పినట్టుగా... పైకి జైలులో జరిగే కథలాగా అనిపిస్తుంది కానీ, ఇందులో ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ‘నా స్వేచ్ఛను భగ్నం చేసి...’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన కవిత్వం గుర్తుకొస్తుంది. ఇలాంటి ఫిలాసఫీతో భారతదేశంలో ఇంతవరకూ సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇందులో గొప్ప తారాగణం కూడా లేదు. కొన్ని డైలాగుల్లో అద్భుతమైన ఆశావాదం, నిజాయతీ కనిపించి, సినిమా చూసిన చాలా రోజుల వరకు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ చిత్ర దర్శకుడి ప్రతిభను మనం గుర్తుపెట్టుకోవాలి. కథను చాలా బాగా తెరపై చెప్పాడు.
ప్రేక్షకులందరికీ సరిగ్గా కనెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీలో సినిమా మూడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే, తెర మీద జరుగుతున్నది ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి ఓ టైమింగ్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అన్నిసార్లూ, అందరికీ అంతు చిక్కదు. ఈ సినిమా ఆ ఫ్రీక్వెన్సీని బాగా పట్టేసింది. అందుకే ఈ సినిమా ప్రపంచమంతటికీ నచ్చేసింది. 1994 ఆస్కార్ అవార్డు పోటీలో ఏడు విభాగాల్లో అవార్డులకు ఈ సినిమా నామినేట్ అయింది. అయితే, ‘ఫారెస్ట్ గంప్’ ఇచ్చిన పోటీ వల్ల ఈ సినిమాకు ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదు. అయినా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. దాని ముందు ఆస్కార్ విలువెంత?!
ఈ సినిమా చెప్పే ఫిలాసఫీ - జీవితేచ్ఛ. జీవితాన్ని జీవితంలా ఆస్వాదించాలి. ఈ సినిమా చూస్తుంటే బతుకు మీద కొత్త ఆశ మొదలవుతుంది. చిన్న చిన్న విషయాలకు హైరానా పడిపోతూ, జీవితాన్ని ఎందుకింత వృథా చేసుకుంటున్నామా అనిపిస్తుంది. జీవితానికో కొత్త అనుభవం, కొత్త ఉత్సాహం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
జీవితాన్ని వడకట్టిన హారర్ కథకుడు
సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత ఫ్రాంక్ డారాబాంట్ ప్రాథమికంగా హార్రర్ సినిమాల రచయిత. ‘ఎ నైట్మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3 - డ్రీమ్ వారియర్స్’, ‘ది బ్లాబ్’, ‘ది ఫ్లై-2’ లాంటి హార్రర్ చిత్రాలు రాసింది ఆయనే. టీవీలో ‘ది వాకింగ్ డెడ్’ అనే హార్రర్ సిరీస్‌ను తీర్చిదిద్ది, కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరించారు. స్వతహాగా రచయిత అయినప్పటికీ, మరో రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన నవలల్ని ఆయన వెండితెరకెక్కించడం విశేషం. ‘ది షాషాంక్ రిడెంప్షన్’ (1994)తో పాటు ‘ది గ్రీన్ మైల్’ (1999), ‘ది మిస్ట్’ (2007) చిత్రాలూ అలా కింగ్ రాసిన నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలే. కింగ్ రాసిన ‘ది లాంగ్ వాక్’, ‘ది మంకీ’ అనే మరో రెండు కథల హక్కులు కూడా డారాబాంట్ దగ్గరే ఉన్నాయి. వాటిని ఎప్పటికైనా సినిమాలుగా తీస్తానంటారాయన. చిత్రమేమిటంటే, సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ చిత్రాల్లో కొన్నింటికి స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసింది డారాబాంటే! ‘ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్’ సినిమా తొలి డ్రాఫ్ట్ కూడా డారాబాంట్ రాసిందే!
ఫ్రాంక్ డారాబాంట్
రచయిత, దర్శక, నిర్మాత