భయానికీ, ఆశకూ మధ్య...
ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(ఐఎమ్‌డీబీ)ని ప్రతి రోజూ విశ్వవ్యాప్తంగా 1.6 కోట్లమంది సందర్శిస్తారు. రివ్యూలు, ఫోటో గ్యాలరీలు, డౌన్‌లోడ్ లింకులతో సహా దాదాపు ఇరవై లక్షల సినిమాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది ఇందులో! ఇలాంటి నేపథ్యమున్న సైట్‌లో గత పదిహేను సంవత్సరాలుగా ఒకే చిత్రం ‘ద బెస్ట్’ గా నిలుస్తోంది! వేలాది చిత్రాల మధ్య అది టాపర్‌గా నిలుస్తోంది.
హాలీవుడ్ సినిమాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయమైన సమాచార వాహినిగా ఉన్న ఈ సైట్‌లో ఆ సినిమా ఆధిపత్యాన్ని అందుకునే చిత్రాలు రావడం లేదు.నెటిజన్లే ఓటర్లుగా ఐఎండీబీ ఎంపిక చేసిన అత్యుత్తమ 250 హాలీవుడ్ సినిమాల్లో తొలిస్థానంలో నిలుస్తున్న ఆ చిత్రమే ‘ద షాషాంక్ రెడెంషన్’. 1994 లో విడుదలైన ఈ సినిమా 1998 నుంచి ఇప్పటి వరకూ టాప్ రేటింగ్‌తో తొలిస్థానంలో నిలిచి, కొనసాగుతోంది.
1990ల ప్రారంభంలో కేవలం ఒక డాలర్ చెల్లించి తను రాసిన కథలను, నవలలను సినిమాగా తీసుకోవచ్చుననే బ్రహ్మాండమైన ఆఫర్‌ను ఇచ్చాడు అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్. ఆయనేమీ అప్పటికింకా ఔత్సాహిక యువ రచయిత కాదు, ఆయన రాసిన అనేక కథాంశాలు అప్పటికే సినిమాలుగా రూపొంది కోట్లాది డాలర్ల కలెక్షన్లను సాధించాయి! అప్పటికే రెండు దశాబ్దాలుగా రచయితగా ప్రస్థానం సాగించిన కింగ్ నుంచి వచ్చిన ఆశ్చర్యకరమైన ప్రకటన అది.
ఆ ప్రకటన చాలా మంది హాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు బంపర్ ఆఫర్ అయ్యింది. అంత వరకూ కింగ్ నవలలను మూస పద్ధతిలో అనేక మంది దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తూ వస్తున్న నేపథ్యంలో... తన అక్షరాలను తెరపై సృజించదగిన వారి కోసం కింగ్ ఈ ప్రయత్నం చేశాడనుకోవాలి.
అద్భుతమైన సినిమాకు తగిన ముడిసరుకు ఉంటుంది కింగ్ రచనల్లో. జీవితానికి పాజిటివ్ కోట్ వేసి పాత్రచిత్రణ చేస్తారు కింగ్. చాలా వరకూ హారర్ నవలలే రాసిన స్టీఫెన్‌కింగ్ భిన్నమైన షార్ట్ స్టోరీల్లో ఒకటి ‘రీటా హేవర్త్ అండ్ షాషాంక్ రెడెంషన్’. కింగ్ అభిమాని అయిన దర్శకుడు ఫ్రాంక్ డరబోంట్ ఆ ఒక్క డాలర్ ఆఫర్ కింద ఈ షార్ట్‌స్టోరీని ఎంచుకొని సినిమాగా రూపొందించాడు.
రెండు దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి కథే ఈ సినిమా. భార్య హత్య గురించి చేయని నేరానికి హీరో ‘రెండు జీవితాల ఖైదు’ అనుభవించాలని శిక్ష విధిస్తుంది కోర్టు.
అతడిని ‘షాషాంక్’ అనే జైలుకు తరలిస్తారు. అక్కడి పరిస్థితుల మధ్య జైలును సంస్కరించడానికి, అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అతడు చేసే ప్రయత్నాల కథే మిగతా సినిమా. హీరో పాత్రద్వారా ఎక్కడా నిరుత్సాహం, నిస్తేజం ఆవరించకుండా పరిస్థితులకు తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవడాన్ని పాఠంగా చూపిస్తారు.
‘ఫియర్ కెన్ హోల్డ్ యూ ప్రిజనర్, హోప్ కెన్ సెట్ యూ ఫ్రీ’ అనే ట్యాగ్‌లైన్ ఈ చిత్రం జీవితానికి అద్దే పాజిటివ్ నెస్‌ను ప్రతిబింబిస్తుంది. ఆశావాహ దృక్పథం గురించి అద్భుత స్థాయిలో ఆవిష్కరించిన ఈ సినిమా గాడ్‌ఫాదర్, గాడ్‌ఫాదర్-2 తదితర చిత్రాలన్నింటినీ దాటుకుని ఐఎండీబీలో ఫస్ట్‌ప్లేస్‌కు చేరుకుంది. సినిమా రూపంలో కూడా ప్రపంచం ఆశావాహ దృక్పథాన్నే ఆదరిస్తుందనేదానికి నిరూపణే ‘ద షాషాంక్ రిడెంషన్’
- జీవన్