ఎస్ఐ వేధింపులు తాళలేక..
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుల ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్ : కడప న గరంలోని టూటౌన్ ఎస్ఐ ఎస్ఐ రోషన్ వేధిస్తున్నాడంటూ ఇరువురు యువుకులు ఆదివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసు సిబ్బంది వీరిని హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో యువకులు చికిత్స పొందుతున్న సమయంలో వారి బంధువులు క్యాజువాలిటీ ముందు బైఠాయించారు. ఎస్ఐ రోషన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై యువకుల బంధువులు, స్నేహితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెల్లంమండివీధిలో నివసిస్తున్న షేక్ జమీల్(28) ఏడురోడ్ల వద్ద సెల్‌ఫోన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్నేహితుడు నాగకుమార్(26) సాయిపేటలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో ఓ పార్టీకి మద్దతుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో టూ టౌన్ ఎస్ఐ ఎస్కె రోషన్ రూ.30వేలు ఒకసారి, రూ.20వేలు మరోసారి తీసుకున్నాడు. అలాగే రూ.14వేలు ఎండీహెచ్ పెట్రోల్ బంకులో బిల్లు చెల్లించారు. తిరిగి ఇటీవల కొంతకాలంగా తనకు రూ.50వేలు నగదుతోపాటు ఐ ఫోన్ కావాలని వేధిస్తున్నాడు.
దీంతో ఎస్ వేధింపులు తాళలేక జమీల్, అతని స్నేహితుడు నాగకుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈనెల 12వ తేదీన రాత్రి సమయంలో రామకృష్ణ హైస్కూల్ వద్ద ఉండగా డయల్ 100 నుంచి తమకు ఫోన్ వచ్చిందని, అక్కడున్న వారంతా వచ్చి స్టేషన్లో హాజరుకావాలని ఎస్ఐ పదేపదే జమీల్‌ను, అతని స్నేహితుడు నాగకుమార్, మహేష్, వెంకటేష్‌లను వేధిస్తున్నాడు. ఎస్ఐ వేధింపులతోనే వీరిద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుల బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు.
క్యాజువాలిటీ ఎదుట బైఠాయింపు :
జమీల్, నాగకుమార్లను ఎస్ఐ రోషన్ వేధించడం వల్లనే వారు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని యువకుల స్నేహితులు రిమ్స్ క్యాజువాలిటీ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రిమ్స్‌కు చేరుకున్న డీఎస్పీ, సీఐలు :
సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్‌నవీన్ గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, అర్బన్ సీఐ బి.శ్రీనివాసులు, రూరల్ సీఐ రాజగోపాల్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషా, తాలూకా ఎస్ఐ బాలమద్దిలేటిలు తమ సిబ్బందితో రిమ్స్‌కు చేరుకున్నారు. సంఘటనకు దారితీసిన కారణాలను యువకుల బంధువులను, స్నేహితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ క్యాజువాలిటీ వద్ద బైఠాయించిన వారితో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు సంఘటనపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసులు ఏమన్నారంటే.. :
ఈ సంఘటనపై అర్బన్ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకులు, మరికొంతమంది ఈనెల 12వ తేదీ రాత్రి రామకృష్ణ హైస్కూల్ వద్ద గొడవ పడేందుకు సిద్ధమవగా డయల్ 100కు ఫోన్ చేశారని, సంఘటన జరిగిన వెంటనే వారిని ఎస్ఐ స్టేషనకు పిలిపించి విచారించారని, ఆదివారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. సంఘటనపై సమగ్రంగా విచారిస్తామన్నారు.
ఎస్ఐ రోషన్ వీఆర్‌కు :
సంఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ టూటౌన్ ఎస్ఐ ఎస్కె రోషన్‌ను వీఆర్‌లో రిపోర్ట్ చేసుకోవాలని వెంటనే ఆదేశాలు జారీచేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ ఎస్కె రోషన్ వీఆర్‌లో రిపోర్ట్ చేసుకున్నారు.