Shekhar Chandra
-
ఆ మాట వినగానే నాన్న షాక్ అయ్యారు
‘‘నచ్చావులే’ సినిమా నుంచి నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘సవారి’ పాటల్ని పెద్ద హిట్ చేశారు. ముఖ్యంగా ‘నీ కన్నులు..’ పాట ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటతో టిక్ టాక్‌లో కొన్ని లక్షల వీడియోలు చేశారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, రాసిన కాసర్ల శ్యామ్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘వలయం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదల చేసిన ‘నిన్ను చూశాకే..’ పాటకి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా శేఖర్ చంద్ర చెప్పిన విశేషాలు. ►మా నాన్నగారు (హరి అనుమోలు) కెమెరామేన్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు ఆయన షాకయ్యారు. సినిమాటోగ్రఫీ అంటే ఫర్వాలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా అంటే చాలా రిస్క్ అన్నారు. కొన్ని సినిమాలు చేశాక వాటికి వచ్చిన స్పందన చూసి ఆయనకి నమ్మకం కుదిరింది. ►నేను సంగీత దర్శకుడు కావడానికి స్ఫూర్తి కీరవాణి, ఏ.ఆర్.రెహమాన్గార్లు. నేను చిత్రపరిశ్రమకి వచ్చి 14 ఏళ్లు అయింది. ఇప్పటి వరకూ దాదాపు 35 సినిమాలు చేశాను. నా కెరీర్ చాలా కూల్‌గా వెళ్తోంది. నా పాటలకు మంచి స్పందన వస్తోంది. వాటిని ఎక్కువగా టిక్ టాక్‌లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగులో సాధించాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత ఇతర భాషల గురించి ఆలోచిస్తా. ►నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా కల్యాణ్ రామ్‌గారి ‘118’ . అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది.. అది పెద్ద చాలెంజ్. ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా? అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్ సినిమా. అయితే ‘చందమామే..’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అని కల్యాణ్ రామ్‌గారు అభినందించడం మరచిపోలేను. ►పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదనే భావన ఉంది. నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. దీంతో ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు కదా? ప్రేమ కథా చిత్రాలు చేయడం వల్ల మంచి మెలోడీస్, థ్రిల్లర్స్ చేయడం వల్ల చక్కని నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం ఉంటుంది. -
ఆంజనేయస్వామి ఎవరో తెలుసుకోవాలనుంది!
– దర్శకుడు మారుతి ‘‘రక్షక భటుడు’ చిత్రంలో పోలీస్ గెటప్‌లో ఉన్న ఆంజనేయస్వామి మోషన్ పోస్టర్ చూస్తే ఆ నటుడు ఎవరా? అని అందరిలో ఓ కుతూహలం పెరిగింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి నాలోనూ కలిగింది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. రిచా పనయ్, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో ‘రక్ష, జక్కన్న’ చిత్రాల ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఎ. గురురాజ్ నిర్మించిన చిత్రం ‘రక్షక భటుడు’. శేఖర్ చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. ఎ. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘జక్కన్న’ సినిమాలో నేను ఓ పాత్ర చేశా. ఆ టైమ్‌లో వంశీకృష్ణగారు వినిపించిన కథ బాగా నచ్చింది. ముఖ్యంగా వంశీ చెప్పిన క్లయిమాక్స్ విని ఒళ్ళు జలదరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నేను సినిమాలపై ఉన్న ఇష్టంతోనే ఈ చిత్రంతో నిర్మాతగా మారా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో ఆంజనేయస్వామి గెటప్‌లో ఉన్న హీరో ఎవరనే ఆసక్తి అందరిలో కలిగింది. మే ప్రథమార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఆ నటుడు ఎవరనేది తెలిసేది అప్పుడే. శేఖర్ చంద్ర మంచి పాటలిచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. గురురాజ్‌గారు రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించినట్లుగానే సినిమా రంగంలోనూ సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని వంశీకృష్ణ అన్నారు. రిచా పనయ్, శేఖర్ చంద్ర, పాటల రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వజ్రాల కోసం....
ఒకేసారి వేల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది అడవిలో సాగించే అన్వేషణ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వజ్రాల వేట’. గిడ్డేష్, కిరణ్, సమీర ముఖ్యతారలుగా శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అచ్యుత్ బాలకృష్ణ, ఛాయాగ్రహణం: బీవీ రావు. -
‘టైగర్’ దర్శకునితో సినిమా
వైవిధ్యమైన చిత్రాలకు సరికొత్త చిరునామా... నిఖిల్. తాజాగా ఆయన మరో విభిన్న చిత్రానికి పచ్చజెండా ఊపారు. సందీప్ కిషన్ హీరోగా ై‘టెగర్’ చేసిన వి.ఐ. ఆనంద్‌తో ఆయన సినిమా చేయనున్నారు. మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించనున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని నిఖిల్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, సహనిర్మాత: డి. శ్రీనివాస్. -
వారాంతంలో రెండు రోజులు
‘‘దర్శకుడు కావాలన్న నా కలను నటుడు శ్రీహరి నెరవేర్చారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ప్రస్తుత ట్రెండ్‌లో వారాంతంలో రెండు రోజులు ఎలా గడుస్తున్నాయనేది ఈ చిత్రంలో చూపించాం. ఇందులో స్టార్ హీరోలు లేకపోయినా అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి’’ అని దర్శకుడు గవర నాగు చెప్పారు. అదిత్, సుప్రియా శైలజ జంటగా తోట మధు నిర్మిస్తోన్న ‘వీకెండ్ లవ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని రమేశ్ ప్రసాద్ ఆవిష్కరించి, గుణ్ణం గంగరాజుకి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘నాగు చాలా బాగా తెరకెక్కించాడు. శేఖర్‌చంద్ర మంచి ట్యూన్స్ ఇచ్చాడు. పాటలు ఈ సినిమాకు ఎస్సెట్ అవుతాయి’’ అని తెలిపారు. అదిత్, రవివర్మ, పూజ, కుంచెరఘు, బి.జయ, భాగ్యలక్ష్మి, సురేశ్ కొండేటి తదితరులు మాట్లాడారు.