రైల్వే ట్రాక్ లనూ వదలని సెల్ఫీల పిచ్చి..
యాండ్రాయిడ్ ఫోన్ల పుణ్యమాని... జనంలో సెల్ఫీల పిచ్చి రోజు రోజుకూ ముదిరిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధికి వినియోగించుకోవడం మంచిదే. కానీ వేళాపాళా, సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలకు పోజులిచ్చేస్తూ.. అనవసరమైన ప్రమాదాలను కొనితెచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సీసీ టీవీ ఫుటేజ్ ను చూస్తే.. జనం ఏ లెవెల్ లో సెల్ఫీలు దిగుతున్నారో షాకింగ్ కు గురిచేస్తోంది.
ఎప్పుడూ పాసింజర్లతో రద్దీగా ఉండే ఇంగ్లాండ్ డర్బీషైర్ మ్యాట్ లాక్ బాత్ స్టేషన్ ప్రాంతం... ఇప్పుడు సెల్ఫీల పిచ్చోళ్ళకూ కేంద్రంగా మారింది. పిల్లలు, టీనేజర్లు, ఫ్యామిలీలు ఒక్కరేమిటీ అక్కడినుంచీ ప్రయాణించే ప్రతివారూ ట్రైన్ వచ్చేలోపూ ఏకంగా పట్టాలమీదే సెటిలైపోతున్నారు. లెవెల్ క్రాసింగుల్లో ట్రైన్ వస్తుందని కూడా చూడకుండా సెల్ఫీలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఉన్నట్టుండి రైలు వస్తే ప్రాణాలకే ప్రమాదమని రైల్వే బాసులు చెప్పినా పట్టించుకోవడం లేదు. తాజాగా న్యూయార్క్ రైల్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఫుటేజ్ ను పరిశీలిస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్ లపై ఆటలాడుతూ, నడుస్తూ ఫొటోలకు పోజులివ్వడమే కాక, ఫోనుల్లో మెసేజ్ లు పంపుతూండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏకంగా ఓ తల్లి తన పిల్లలను ఫొటో తీసేందుకు ట్రాక్ పై కూర్చోపెట్టడం... రైల్వే అధికారులను షాక్ అయ్యేట్టు చేసింది. ట్రైన్ వచ్చే సమయంలో గేట్లు మూసుకుపోతాయని, పట్టాలపై ఉన్నవారు జాగ్రత్త వహించాలని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ట్రాక్ లపై కాలక్షేపం చేయడం విస్మయ పరుస్తోంది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి వారిని మందలించేందుకు సిద్ధమౌతున్నారు. అందుకు ప్రజల సహాయం కూడ తీసుకుంటున్నారు.
లెవెల్ క్రాసింగ్ ల వద్ద సుందరమైన ప్రాంతాలను చిత్రీకరించడం ఎంతో ఆనందాన్నివ్వచ్చు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదు. రైల్వే ట్రాక్ లు... ప్లే గ్రౌండ్లు కాదు అంటున్నారు నెట్ వర్క్ రైల్ ఆపరేషన్స్ రిస్క్ ఎడ్వైజర్ మార్టిన్ బ్రౌన్. ట్రైన్ ఎప్పుడైనా, ఎటువైపునుంచైనా వచ్చే అవకాశం ఉంటుందని, ట్రాక్ లపై ఫోటోలు దిగడం, ఛాటింగ్ చేయడం, ఆటలాడటం తగదని, ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. మ్యాట్ లాక్ బాత్ స్టేషన్ మీదుగా రోజూ సుమారు 30 ట్రైన్స్ వెడుతుంటాయని, ఇక్కడ సుమారు 5 వందల మంది సైకిలిస్టులు, పాదచారులు లెవెల్ క్రాస్ చేస్తుంటారని, ఇటువంటి రద్దీ ఉండే క్రాస్ వద్ద ఉన్న స్టాప్.. లుక్... లిజన్... వంటి సూచనలు తప్పకుండా ప్రయాణీకులు ఫాలో అవ్వాలని లేదంటే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
విక్టోరియన్ రైల్వే నెట్ వర్క్ లో అంతర్భాగంగా బ్రిటన్ మొత్తం సుమారు 6 వేల వరకూ లెవెల్ క్రాసింగ్ లు నిర్మించారని, వాటిని సద్వినియోగం చేసుకోకుంటే ప్రమాదాలకు హేతువుగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ తమ పిల్లలను బయటకు పంపేప్పుడు కుటుంబ సభ్యులు, ఇంట్లోని వారు తగు జాగ్గత్తలు చెప్పాలని, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని బ్రిటిష్ ట్రాన్స్ పోర్ట్ పోలీస్ అధికారి ఎడ్డీ కార్లిన్ హెచ్చరిస్తున్నారు. తాజా ఫుటేజ్ ను బట్టి చూస్తే.. ఎంత గస్తీ ఏర్పాటు చేసినా ప్రజలు కూడ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రయోజనం ఉండదని, ఫోటోల సరదా ప్రాణాలనే తీస్తుందని అంటున్నారు.