Shoma Chaudhary
-
షోమా చౌదరికి సమన్లు
పణజి: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీచేశారు. ఈ విషయాన్ని డీఐజీ ఓపీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే వారి వాంగ్మూలాన్ని ఎప్పుడు రికార్డు చేస్తారనే దానిని మాత్రం వెల్లడించలేదు. కానీ, శుక్రవారం లేదా శనివారం రికార్డు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఉద్యోగానికి రాజీనామా చేయకముందు గోవా పోలీసు బృందం షోమా వాంగ్మూలాన్ని ఢిల్లీలో రికార్డు చేశారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న తేజ్‌పాల్‌కు బుధవారం ఉదయం రెండో దశ వైద్య పరీక్షలు చేశారు. ఇదంతా విచారణలో భాగంగానే జరుగుతోందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, మరో నెల, నెలన్నరలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారని గోవా సీఎం మనోహర్ పారికర్ తెలిపారు. ఫ్యాన్‌కు అనుమతి నిరాకరణ తేజ్‌పాల్ ఉన్న లాకప్ గదికి ఫ్యాన్ సదుపాయం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జుడీషియల్ మెజిస్ట్రేట్ కృష్ణ జోషి తోసిపుచ్చారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఫ్యాన్ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తేజ్‌పాల్ తరఫు న్యాయవాది సోమవారం ఆ పిటిషన్ దాఖలు చేశారు. -
తేజ్‌పాల్‌కు 6 రోజుల కస్టడీ
పణజీ: తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను పణజీ కోర్టు ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు ఆదివారం జుడీషియల్ మేజిస్ట్రేట్ షామా జోషీ ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్సెస్ తవేరా విజ్ఞప్తితోపాటు కేసు విచారణలో తేజ్‌పాల్ పోలీసులకు సహకరిస్తున్నందున కస్టడీ అవసరంలేదన్న డిఫెన్స్ న్యాయవాదుల వాదననూ తోసిపుచ్చారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను శనివారం రాత్రి అరెస్టు చేయడం తెలిసిందే. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు తేజ్పాల్ను క్రైం బ్రాంచి హెడ్‌క్వార్టర్స్‌కు తరలించి ఐదు గంటలకుపైగా ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు ఆయన్ను తిరిగి లాకప్‌కు తరలించారు. సోమవారం తిరిగి విచారణ కొనసాగించనున్నారు. శనివారం రాత్రి తేజ్పాల్ను అరెస్టు చేశాక పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం అర్ధరాత్రి 12.30 గంటలకు గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. పరీక్షలు ముగిశాక బయటకు వచ్చిన తేజ్‌పాల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో తేజ్పాల్ను పోలీసు హెడ్‌క్వార్టర్స్ వద్దకు తీసుకొచ్చాక ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. అనంతరం పోలీసులు తేజ్పాల్ను ఇద్దరు హత్య కేసు నిందితులు సహా ముగ్గురిని ఉంచిన లాకప్‌లోకి పంపారు. కాగా, బాధితురాలు తనపై అత్యాచార అభియోగాలు మోపడం వెనక రాజకీయ కుట్ర ఉందంటూ అరెస్టుకు ముందు వరకూ ఆరోపించిన తేజ్‌పాల్... ముందస్తు బెయిల్ దరఖాస్తులో మాత్రం ఆ ఆరోపణలను ప్రస్తావించకపోవడం గమనార్హం. కేసులో జోక్యం చేసుకోం: షిండే తేజ్పాల్పై నమోదైన కేసులో కేంద్రం జోక్యం చేసుకోబోదని కేంద్ర హోంమంత్రి షిండే స్పష్టం చేశారు. దోషులెవరినీ తమ ప్రభుత్వం రక్షించదని...అదే సమయంలో వేరే రాష్ట్రానికి (గోవా) సంబంధించిన కేసులో జోక్యం చేసుకోబోదని ముంబై లో వ్యాఖ్యానించారు. మరోవైపు తెహెల్కా గ్రూపు డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ. 26 లక్షల సర్వీసు ట్యాక్స్‌ను తెహెల్కా చెల్లించలేదని ఆడిటర్ల తనిఖీల్లో తేలింది.