Shoojit Sircar
-
అభిషేక్ బచ్చన్ మూవీతో ఏం చేయాలో దిక్కుతోచలేదు: డైరెక్టర్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గతేడాది ఐ వ్యాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు సుజిత్ సిర్కార్ ఈ మూవీ పరాజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా ఫలితం తనకు దిక్కుతోచని పరిస్థితి తీసుకెళ్లిందని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ థియేటర్లలో విఫలం కావడం తనను బాధించిందని సుజిత్ సిర్కార్ తెలిపారు.డైరెక్టర్ సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. "నా నిబంధనల ప్రకారం.. నాకు ఉన్న దృష్టితో నేను సినిమాలు తీయగలిగినంత కాలం తీస్తూనే ఉంటా. ఇలాంటి పరాజయాలు కొన్నిసార్లు మమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయం తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. ఈ సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు నా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలో చాలామంది ఆడియన్స్ స్పందించడం సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి చిత్రమనే నేను అనుకుంటున్నా.' అని అన్నారు.కాగా.. సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ఓ ఎన్నారై పాత్రలో కనిపించారు. జీవితాన్ని మార్చే ఓ సర్జరీ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం ఏకంగా బరువు కూడా పెరిగాడు. విభిన్నమైన పొట్టతో అభిషేక్ బచ్చన్ ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ, జానీ లీవర్, పెర్లే డే, క్రిస్టిన్ గొడ్దార్డ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఐ వాంట్ టూ టాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
సరదా సందేహం
కరోనా కారణంగా చేయి చేయి కలపొద్దు అంటున్నారు. సామాజిక దూరం పాటించమంటున్నారు. అయితే బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్‌కి ఓ విచిత్రమైన సందేహం వచ్చింది. అదేంటంటే... కరోనా వైరస్ హడావిడి మొత్తం తగ్గిన తర్వాత సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారు? అన్నదే ఆ డౌట్. ఈ సరదా సందేహాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘సినిమాల్లో వచ్చే ముద్దు సన్నివేశాలు, కౌగిలించుకునే సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారో చూడాలి. ఒకవేళ అలాంటి సీన్లను తీసేటప్పుడు నటీనటుల మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చేసి, ఆ తర్వాత దగ్గరగా ఉన్నట్లు చూపించాల్సి వచ్చినా రావొచ్చు. అలా మోసం చేసి అయినా కథలు చెప్పాల్సిందే కదా’’ అని సూజిత్ పేర్కొన్నారు. ‘విక్కీ డోనర్’, ‘మదరాస్ కేఫ్’, ‘పీకు’ వంటి చిత్రాల ద్వారా తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు సూజిత్. -
త్వరలో షూటింగ్‌కు ఇర్ఫాన్ ఖాన్
కొంతకాలంగా బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టుగా ప్రకటించిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ స్వయంగా ట్వీట్ చేసినా, ఆయన భార్య మీడియా ద్వారా స్పందించినా రూమార్స్ మాత్రం ఆగలేదు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు సూజిత్ సర్కార్.. ఇర్ఫాన్ ఆర్యోగ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన ఉద్ధమ్ సింగ్ బయోపిక్‌లో నటిస్తారు’ అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని ప్రతీకారంగా పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను మట్టుపెట్టిన స్వతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్. సూజిత్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కథలో ముందుగా రణబీర్ కపూర్ నటిస్తాడన్న వార్తలు వినిపించినా.. సూజిత్.. ఇర్ఫాన్ ఖాన్ ఉద్ధమ్ పాత్రలో నటించనున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. -
'అమితాబ్ ఇంటలిజెంట్ యాక్టర్'
బాలీవుడ్ షెహన్షా అమితాబ్, వయసైపోతున్నా విలక్షణ పాత్రలతో ఈ జనరేషన్ నటులకు పోటి ఇస్తున్నాడు. వరుసగా అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్లను ఎంచుకుంటున్న బిగ్ బి, మరోసారి అదే ప్రయోగం చేస్తున్నాడు. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పింక్ సినిమాలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న లాయర్‌గా నటిస్తున్నాడు. ఈ పాత్రకు అమితాబ్ ఎంపిక ఎలా జరిగిదన్న విషయాన్ని బయటపెట్టాడు సూజిత్ సర్కార్. 'పీకు సినిమా షూటింగ్ సమయంలోనే పింక్ సినిమాలోనే లాయర్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ జరిగింది. అసలు ఆ పాత్రను యువ నటుడితో వేయించాలా..? లేదా మిడిల్ ఏజ్ ఆరిస్ట్‌తో చేయించాలా..? లేక సీనియర్‌ను ఎంపిక చేయాలా..? అని ఆలోచించాం. అదే సమయంలో అమితాబ్ ఆ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బిగ్ బిని సంప్రదించాం. పింక్ సినిమాలోని పాత్ర గురించి ఆయనకు వివరించా... అమితాబ్ ఇంటలిజెంట్ ఆర్టిస్ట్. కేవలం ఐదు నిమిషాల పాటు కథ విని ఈ పాత్రకు అంగీకరించారు'. అని బిగ్ బి ఎంపిక వెనుక కథను తెలియజేశారు. అనిరుద్దా రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. -
బిగ్‌బి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమై, తరువాత నార్త్ మీద దృష్టి పెట్టిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఇప్పటి వరకు కెరీర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటి కూడా లేకపోయినా ఆసక్తికరమైన సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఈ మధ్యే అక్షయ్ కుమార్ సరసన బేబి సినిమాతో యాక్షన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ ఓ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న సందేశాత్మక చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనుంది. బిగ్ బి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఛాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతుంది ఈ అమ్మడు. పూర్తిగా ఢిల్లీలో షూటింగ్ జరగనున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది తాప్సీ. -
'ఈ నగరాన్ని వదిలివెళ్లడం చాలా కష్టం'
షూజిత్ సర్కార్ తీస్తున్న 'పికు' సినిమా షూటింగ్ ముగిసిపోవడంతో కోల్‌కతా నగరాన్ని వదిలి వెళ్లాల్సి రావడం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు చాలా కష్టంగా అనిపిస్తోంది. తన తొలినాళ్లలో ఈ నగరంలోనే గడిపిన ఆయన.. షూటింగ్ జరిగిన నెలరోజులూ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిపోవడంతో ఆయన తిరిగి ముంబై వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ''ఇలా వదిలి వెళ్లడం చాలా కష్టమే.. కానీ తప్పదు'' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో ఆయన దీపికా పడుకొనే తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు ప్రకాష్ ఝా తీసిన 'ఆరక్షణ్'లో కూడా ఆయన దీపికకు తండ్రిగానే చేశారు. పికు సినిమాకు అందించిన సహకారం చాలా బాగుందంటూ మమతా బెనర్జీకి దర్శకుడు షూజిత్ సర్కర్ ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఆశీర్వాదాలు లేకుండా ఈ షూటింగ్ జరిగేదే కాదన్నారు. అలాగే కోల్‌కతా ప్రజలు కూడా చాలా ప్రేమ కనబరిచారని, దాంతో తాము ఇంట్లో ఉన్నట్లే అనిపించిందని ట్వీట్ చేశారు. కోల్‌కతాలోని ప్రఖ్యాత రైటర్స్ బిల్డింగ్, హౌరా బ్రిడ్జి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన ఇది విడుదల కావచ్చని భావిస్తున్నారు. T 1677 - As the Kolkata schedule closes in to an end, withdrawal symptoms creep in .. shall be a tough leave .. BUT .. we shall be back ! — Amitabh Bachchan (@SrBachchan) November 16, 2014 -
గుజరాత్ ప్రచారానికి అమితాబ్ ఫొటో షూట్
గుజరాత్ రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే కృషిలో భాగంగా ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్.. ఆ రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు షూజిత్ సర్కార్ ఈ షూటింగుకు దర్శకత్వం వహిస్తున్నారు. గుజరాత్‌లోని అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో వన్యప్రాణుల సంరక్షణ మీద ప్రధానంగా ఈ ప్రకటనలో దృష్టి సారించనున్నారు. ''అక్కడున్న వివిధ పక్షులు, జంతువుల ఫొటోలు తీసుకోడానికి నేను, బచ్చన్ సాబ్ కలిసి తిరుగుతున్నాం. కచ్ ప్రాంతంలోని రణ్ అడవులలో గల అడవి గాడిదలు చాలా ప్రముఖమైనవి. వాటిని మా కెమెరాలలో బంధించేందుకు వెళ్తున్నాం. వాటితో పాటు కృష్ణజింకలు, అనేక జాతులకు చెందిన పక్షుల ఫొటోలు కూడా తీసుకుంటాం. మీకు తెలుసా, ప్రతియేటా శీతాకాలంలో ఇక్కడకు అనేక జాతులకు చెందిన పక్షులు వలస వస్తాయి. మళ్లీ సీజన్ అయిపోగానే అవి వాటి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. వాటిని కూడా కెమెరాలలో బంధిస్తున్నాం. ఇక్కడ చాలా అద్భుతమైన వన్యప్రాణులున్నాయి'' అని షూజిత్ సర్కార్ తెలిపారు. కనీసం ప్రాథమిక సదుపాయాలు కూడా ఏమీ లేని ప్రాంతాల్లోకి బిగ్ బీ, సర్కార్ వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. జనవరి చివరి వారంలో గుజరాత్లో గడపడం అంటే చాలా కష్టమని, తానుఅమితాబ్ కలిసి ఇక్కడి వన్యప్రాణులను గాలిస్తామని, క్రియేటివ్ కన్సల్టెంటు పీయూష్ పాండే కూడా మాతో ఉంటారని కూడా సర్కార్ చెప్పారు. -
రక్తం పీల్చయినా సరే : షూజిత్ సర్కార్
ముంబై: తన కొత్త సినిమా మద్రాస్ కేఫ్ ఫలితంపై దర్శకుడు షూజిత్ సర్కార్ ఎంతో ధీమాగా ఉన్నాడు. శ్రీలంక పౌరయుద్ధం ఆధారంగా తీసిన ఈ సినిమా జాన్ అబ్రహం, నర్గిస్ ఫక్రికి మంచి పేరు తెస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు. నటుల్లోని రక్తం పీల్చి అయినా వారి నుంచి ఫలితం రాబట్టడం తనకు తెలుసన్నాడు. మద్రాస్కేఫ్లో వీళ్లద్దరూ అద్భుతంగా నటించారని కితాబిచ్చాడు. పదేళ్లుగా బాలీవుడ్లో ఉంటూ ధూమ్, దోస్తానా, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, షూటౌట్ ఎట్ వాడాలా వంటి పెద్ద చిత్రాల్లో నటించినా జాన్‌కు ఇప్పటికీ పెద్దనటుడిగా గుర్తింపు లేదు. రాక్‌స్టార్‌తో హిందీ సినిమాల్లోకి వచ్చిన నర్గిస్ ఫక్రి నటన ఏమీ బాగాలేదని విమర్శలు రావడంతో ఈ బ్యూటీ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. శుక్రవారం విడుదలవుతున్న మద్రాస్‌కేఫ్ చూసిన తరువాత ప్రేక్షకులు జాన్, నర్గిస్‌పై ఇది వరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటారని సర్కార్ అంటున్నాడు. ‘ప్రతి ఒక్కరిలోనూ నటనాసామర్థ్యం ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారనేదే ముఖ్యం. ఇంతకుముందు నేను తీసిన వికీ డోనర్ పూర్తిగా నటుడు, పాత్రలపై ఆధారపడ్డ సినిమా. నేను ఏ ఒక్క నటుడినీ వదిలిపెట్టను. వాళ్ల రక్తం పీల్చి మరీ నటనను రాబట్టుకుంటాను. మద్రాస్‌కేఫ్ విడుదల తరువాత జాన్, నర్గిస్‌పై విమర్శకుల ఆలోచనావిధానం మారుతుంది. అవసరమైతే ఈ విషయాన్ని కాగితంపై రాసిస్తాను’ అని షూజిత్ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు మొదటి నుంచి జాన్నే తీసుకోవాలని భావించినా, నర్గిస్ పేరు మాత్రం అనుకోలేదని చెప్పాడు. మద్రాస్‌కేఫ్ నర్గిస్‌కు కొత్త కెరీర్‌ను ఇస్తుందని హామీ ఇచ్చాడు. ‘ఈ సినిమా ప్రచారం కోసం ఏవో గిమ్మిక్కులు చేసి కథపై ప్రేక్షకులకు శ్రద్ధ లేకుండా చేయిద్దని మార్కెటింగ్ వాళ్లను హెచ్చరించాను. మనం బాధల్లో ఉన్న వాళ్ల గురించి ఇందులో చెప్పాం. వాళ్ల దుస్థితిని సొమ్ము చేసుకోకూడదు’ అని షూజిత్ సర్కార్ వివరించాడు.