సమగ్ర సర్వేకు ఫారాల కొరత
పరిగి: సమగ్ర కుటుంబ సర్వేకు ఫారాల కొరత ఏర్పడింది. వారం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తున్నా సర్వే రోజున గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా సర్వే ఫారాల కొరతతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వే కోసం ముందుగా ఇళ్లకు నంబర్లు సక్రమంగా వేయకపోవటంతో ఈ వివాదం తలెత్తింది.
ప్రధానంగా ఈ సమస్య అన్ని గ్రామాల్లోనూ కనిపించినప్పటికీ పరిగి పట్టణంతో పాటు పరిగి అనుబంధ గ్రామమైన మల్లెమోనిగూడలో గ్రామస్తులు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. మల్లెమోనిగూడలో ఏకంగా రోడ్లపైకి వచ్చి అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఇంట్లో ఐదారు కుటుంబాలు ఉండగా సరైన సమాచారం తీసుకోకుండా ఒక నంబర్ మాత్రమే వేశారు. అదే జాబితాను ఎన్యూమరేటర్లకు అందజేశారు. లిస్టులో లేని ఇళ్లను సర్వే చేసేందుకు నిరాకరించటంతో ఆగ్రహించిన ప్రజలు ఎన్యూమరేటర్లతో వాగ్వాదానికి దిగారు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ శంషుద్దీన్ తదితరులు మల్లెమోనిగూడను సందర్శించి పరిస్థితి సమీక్షించారు. అనంతరం స్పందించిన అధికారులు అదనంగా ఫారాలు పంపించి అందరి ఇళ్లు సర్వే చేసేలా చూస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. ఇదే సమయంలో అదనంగా 1500 సర్వే ఫారాలు జిరాక్స్ తీయించి పరిగితో పాటు కొరత ఉన్న మండల పరిధిలోని గ్రామాలకు పంపించారు.