సాంబుడి సూర్యారాధన
తెలుసుకుందాం
సాక్షాత్తు శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు సూర్యుడిని ఆరాధించినట్లు ప్రతీతి. ఇతడు శ్రీకృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన కొడుకు. ముని శాపం వల్ల కుష్టువ్యాధిగ్రస్థుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించి రోగ విముక్తుడయ్యాడు. కుష్టువ్యాధిగ్రస్థుడైన సాంబుడు సూర్యుడి కోసం పన్నెండేళ్లు కఠోర తపస్సు చేశాడు. సూర్యుడు కరుణించడంతో రోగవిముక్తి పొందాడు. ఒడిశాలోని ప్రసిద్ధ సూర్యక్షేత్రం కోణార్క్ వద్ద ఉన్న స్థలంలోనే సాంబుడు తపస్సు చేసినట్లు ప్రతీతి. పుష్య శుక్ల దశమి రోజున సాంబుడు రోగ విముక్తి పొందినందున ఆ రోజు సాంబదశమిగా పాటించడం ఒడిశాలో ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది.
ఆ రోజున సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ప్రత్యేకమైన పిండివంటలు తయారు చేసి సూర్యభగవానుడికి నైవేద్యం చేస్తారు. పసుపునీళ్లు నింపిన పాత్రను ఆరుబయట ఉంచి, అందులో సూర్యబింబాన్ని దర్శించుకున్న తర్వాతే భోజనం చేస్తారు. ఈ పూజను ‘మహాకాల పూజ’గా అభివర్ణిస్తారు. ఈ పూజలో భాగంగా సూర్యపుత్రుడైన యమధర్మరాజుకు ప్రత్యేకంగా ‘బుఢాచకుళి’ అనే పిండివంటను నివేదిస్తారు.