శిబిచక్రవర్తి దాతృత్వం
పురానీతి
విశ్వవిఖ్యాతి పొందిన మహాదాతలలో శిబిచక్రవర్తి పేరును ముందుగా చెప్పుకోవాలి. ధర్మనిరతిలోను, దానగుణంలోను శిబిచక్రవర్తి పేరు ప్రఖ్యాతులు దేవలోకం వరకు వ్యాపించాయి. అయితే, శిబిచక్రవర్తి నిజంగానే ధర్మనిరతి గలవాడా? దానగుణ సంపన్నుడా? ఇదేదో తేల్చుకోవాలంటే అతడికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు యమధర్మరాజు. ఈ విషయంలో అతడికి తోడుగా ఉండటానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు. ఈ సంగతి తెలియని శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజప్రాసాదం మేడ మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన చెంత వాలింది.
ఈలోగా దానిని తరుముతూ ఒక గద్ద వచ్చింది. అనుకోని పరిణామానికి నివ్వెరపోయాడు శిబిచక్రవర్తి. ప్రాణభయంతో వణుకుతున్న పావురం ‘రాజా! నన్ను నీవే కాపాడాలి’ అంటూ మొరపెట్టుకుంది. ‘తప్పక కాపాడతాను. నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది’ అని భరోసా ఇచ్చాడు. పావురాన్ని తరుముతూ వచ్చిన గద్ద ఊరుకోలేదు. ‘రాజా! నేను ఆకలితో అలమటిస్తున్నాను. ఆ పావురం నా సహజ ఆహారం. దానిని వదిలేస్తే నా ఆకలి తీర్చుకుంటాను’ అని అడిగింది.
‘రక్షణ కల్పిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. దానిని వదల్లేను. నీ ఆకలి తీర్చుకోవడానికి మరేది అడిగినా ఇస్తాను. పావురాన్ని వదిలేయి’ అని బదులిచ్చాడు శిబిచక్రవర్తి.
‘రెండు షరతులకు అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను’ అని చెప్పింది గద్ద. సరేనన్నాడు శిబిచక్రవర్తి. షరతులేమిటో చెప్పమన్నాడు. ‘పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచే కోసి ఇవ్వాలి. మాంసం ఇస్తున్నప్పుడు నువ్వు కంటతడి పెట్టరాదు’ అంది గద్ద.
షరతులకు అంగీకరించాడు శిబిచక్రవర్తి. వెంటనే ఒక తక్కెడను, తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు కత్తిని తెప్పించాడు. గుప్పెడు మాంసం కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు. తన కుడితొడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కెడలోని ఒకవైపు పళ్లెంలో వేశాడు. మరోవైపు పళ్లెంలో పావురాన్ని నిలిపాడు. పావురమే బరువు తూగింది. మరికొంత మాంసాన్ని తీసి వేశాడు. అయినా పావురమే బరువు తూగింది. శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసమంతా తక్కెడలో వేసేశాడు. అయినా పావురమే బరువు తూగింది. ఇదేదో మాయలా ఉందనుకున్నాడు. అయితే, ఏదైనా కానీ తాను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉండాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిబిచక్రవర్తి ఎడమకంట ఒక కన్నీటి బిందువు ఉబికింది.
దానిని చూడగానే గద్ద... ‘రాజా! నీవేదో అయిష్టంగా నీ మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు. అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు. నీ అండలోని పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేసి పోతా. నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా చేస్తా’ అంది.
‘పక్షిరాజా! నువ్వు పొరబడుతున్నావు. నీ ఆకలితీర్చే అదృష్టం నా శరీరంలోని కుడిభాగానికి దక్కినందుకు ఎడమభాగం ఆనందంతో పులకిస్తోంది. అందుకే నా ఎడమకన్ను ఆనందబాష్పాన్ని చిందిస్తోంది. నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమభాగం కూడా సిద్ధంగా ఉంది. చూడు! ఎడమభాగంలోని మాంసాన్ని కూడా వేసేస్తాను’ అంటూ మళ్లీ కత్తికి పనిచెప్పబోయాడు.
శిబిచక్రవర్తి ధర్మనిరతికి, దానగుణానికి సంతోషించిన దేవతలు పూలవాన కురిపించారు. అతడి శరీరానికి పూర్వరూపం ఇచ్చారు. గద్దరూపంలో ఉన్న యమధర్మరాజు. పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. ‘ఇదంతా నీ ధర్మనిరతిని పరీక్షించేందుకు ఆడిన నాటకం’ అని చెప్పి అంతర్ధానమయ్యారు.
నీతి: ఎట్టి పరిస్థితుల్లోనైనా మాట తప్పకపోవడమే ధర్మం.