siddartha jain
-
ఈ-పాస్ ఉంటేనే స్కాలర్షిప్లు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో 1.15 లక్షల పేద విద్యార్థుల కోసం ప్రభుత్వమిచ్చే స్కాలర్షిప్లను సకాలంలో అందించాలని, ఇందుకు ఈ-పాస్ ద్వారా విద్యార్థుల పేర్లను నెలాఖరులోగా ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ కళాశాల యాజమాన్యాలను కోరారు. స్థానిక సీఆర్‌రెడ్డి కళాశాల ఆడిటోరియంలో మంగళవారం కళాశాలల యాజమాన్యం, అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొత్తగా స్కాలర్షిప్పులు పొందే విద్యార్థులంతా ఈనెల 31లోగా, రెన్యువల్ చేసేకునేవారు ఈ నెల 25లోగా ఈ-పాస్ ద్వారా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో 500కు పైగా కళాశాలలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ని రిజిస్టరు కాలేదని అటువంటి కళాశాలలను గుర్తించి ఆన్లైన్లో వాటి పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావును కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి కళాశాల విధిగా వెబ్సైట్ రూపొందించుకోవాలని అందులో పనిచేసే ఫ్యాకల్టీ వివరాలు, కళాశాల సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరచాలని, వారంరోజుల్లో ఈ ప్రక్రియను కళాశాలలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ చేయడానికి రూపొందించిన మైక్రో ప్రాసెసర్ ధరను రూ. 27 వేల నుంచి తక్కువకు అందించేలా తగు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సీపీవో కె సత్యనారాయణ, డీఈవో ఆర్.నరసింహారావు, ఎన్ఐసీ సైంటిస్ట్ గంగాధర్ పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య అవసరం ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన అందించినపుడే ఆశించిన ఫలితాలు సాధ్యమని కలెక్టర్ సిద్ధార్థ జైన్ చెప్పారు. విద్యాప్రమాణాల తీరుపై ఎంఈవోలు, సహాయ సాంఘిక సంక్షేమాధికారులతో మంగళవారం ఆయన ఏలూరులో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తాను పలు ఇంటర్వ్యూలు నిర్వహించానని అయితే ఒక్క విద్యార్థి కూడా సరైన విజ్ఞానం లేకుండా సమాధానాలు ఇచ్చారన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యావిధానం కావాలే తప్ప కాగితాలకే పరిమితమయ్యే డిగ్రీలు ఎందుకని కలెక్టర్ ప్రశ్నించారు. ఎల్కేజీ నుంచే విద్యాప్రమాణాలు మెరుగుపరచడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడం కష్టమేమి కాదన్నారు. -
60 వేల యువతకు ఓటు హక్కు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో కొత్తగా 60 వేల మంది యువతకు ఓటు హక్కు కల్పించామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవంపై అధికారులతో ఆయన కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించారు. ఓటర్ల జాబితా సవరణలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న యువత 60 వేల మందికి ఓటు హక్కు లభించడం జిల్లాలో ఇదే ప్రథమమని చెప్పారు. జిల్లాలో బూత్‌లెవెల్ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారులు, పలు కళాశాలల ప్రత్యేక కృషి ఫలితంగా కొత్త ఓటర్ల నమోదు విజయవంతమైదని పేర్కొన్నారు. ఓటర్ల దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విద్యార్ధులకు వక్తృత్వం, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా స్థాయి పోటీలను ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్ధాయి విజేతలను హైదరాబాదులో ఈ నెల 24న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. గురువారం ఉదయం సీఆర్ఆర్ కళాశాల నుండి ర్యాలీ ప్రారంభిస్తామని దీనిలో ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, టీచర్లు, యువత వివిధ సేవా సంఘాల సభ్యులు, ఎస్సీసీ క్యాడెట్లు, వలంటీర్లు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 25 ఉదయం 10 గంటలకు సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తామన్నారు. 24న 3కే రన్ ఈ నెల 24 ఉదయం 6 గంటలకు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి ఇండోర్ స్టేడియం వరకూ నిర్వహించనున్న 3కే రన్లో యువత, క్రీడాకారులు, ఔత్సాహికులు, పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాలల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జేసీ టి. బాబూరావునాయుడు, డీఆర్వో కె. ప్రభాకరరావు, ఏలూరు ఆర్డీవో బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రేమతో బోధించండి
నల్లజర్ల, న్యూస్‌లైన్ : విద్యార్థులనుభయంతో కాకుండా ప్రేమతో చేరదీసి విద్యాబుద్ధులు నేర్పితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. శనివారం నల్లజర్ల ఏకేఆర్జీ కళాశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై డివిజన్లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతిని తరిమి కొడదాం అంటూనే కొందరు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్యను బోధించాలని ఆదేశించారు. నిర్ధిష్ట ప్రణాళికలు తయారు చేసుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు అంటే రిజల్ట్ కాదని, ఉత్తమంగా బోధించడమని కలెక్టర్ చెప్పారు. డీఈవో నరసింహారావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి డీవైఈవో తిరుమలదాస్, తహసిల్ధార్ సుబ్బారావు పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించండి ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. స్థానిక జలభవన్లో శనివారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణ, ఫొటో ఓటరు గుర్తింపుకార్డుల జారీ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు ఈ నెల 25 జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఫొటో ఓటరు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఇఆర్వోలు వై.రామకృష్ణ, నాగరాజువర్మ తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ కాంతులు
దయ, జాలి, సేవాతత్పరత, త్యాగాలకు ప్రతీకగా నిలిచి.. లోకానికి శాంతి మార్గాన్ని ప్రబోధించిన ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ‘పశ్చిమ’ ముస్తాబైంది. జిల్లాలోని చర్చిలన్నీ విద్యుత్ అలంకరణలతో కాంతులీనుతున్నారుు. క్రీస్తు రాకను స్వాగతిస్తూ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు బిషప్ హౌస్‌లో మంగళవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ క్రిస్మస్ కేకును కట్‌చేసి బిషప్ పొలిమేర జయరావుకు తినిపించారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు, ఏలూరు పీఠాధిపతి శ్రీరాజు, ఫాదర్ మోజెస్, ఫాదర్ ఆబ్రహం, ఫాదర్ బాల, మైనార్టీ కార్పొరేషన్ ఈడీజలీల్ అహ్మద్ పాల్గొన్నారు.