sidney speech
-
పేదల నిజాయితీకి మోదీ సలాం!
-
చెత్త శుభ్రం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తా
విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అద్దాల్లాంటి రోడ్లు చూసి ముచ్చట పడతామని, అదే సమయంలో మనకు మన దేశంలో చెత్తతో నిండిన రోడ్లు గుర్తుకొస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బాపూ జయంతి రోజున స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనాలో హాజరైన దాదాపు 20 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌లో అన్ని వర్గాల వాళ్లు హృదయపూర్వకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారని మోదీ చెప్పారు. చెత్తను శుభ్రం చేసుకోవడాన్ని తాను గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని, చెత్త ఎత్తడానికి చెత్తవాళ్లే రానక్కర్లేదని తెలిపారు. దీపావళి తర్వాతి రోజు ఇళ్లు శుభ్రం చేసుకోవాలంటేనే కష్టపడతామని, అలాంటిది ఊరు మొత్తాన్ని కొద్దిమంది ఎలా శుభ్రం చేస్తారని ఆయన అడిగారు. ఆస్ట్రేలియాలో ఏం నేర్చుకున్నారని అడిగితే.. శ్రమకిచ్చే గౌరవం అని చెబుతానన్నారు. -
గెజిటెడ్ ఆఫీసర్లు సర్టిఫై చేస్తేనే నమ్మాలా?
మనవాళ్లను మనం నమ్మకపోతే పక్కవాళ్లను నమ్ముతామా అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాస్‌పోర్టుల కోసం, ఇంకా వివిధ రకాల పనులకు గెజిటెడ్ అధికారుల వద్ద సంతకాలు చేయించుకునే సంస్కృతికి ఇక కాలం చెల్లాల్సిందేనని అన్నారు. అవతల ఎవరో సర్టిఫై చేస్తేనే మనవాళ్ల నిజాయితీని నమ్మాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటారని, ఇకమీదట అలాంటి సమస్య ఉండబోదని స్పష్టం చేశారు. 125 కోట్ల మంది భారతీయుల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే గెజిటెడ్ అధికారుల సంతకాల అవసరాన్ని పూర్తిగా తప్పించానని చెప్పారు. -
పేదల నిజాయితీకి మోదీ సలాం!
భారతదేశంలో నిరుపేదల నీతి, నిజాయితీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలాం కొట్టారు. ప్రధానమంత్రి జనధన యోజన కింద పేదలతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన విషయాన్ని సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరెనాలో వేలాది సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులకు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో నిరుపేదల నిజాయితీ గురించి చెబుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. జనధన యోజన కింద ఒక్క రూపాయి కూడా వేయక్కర్లేకుండానే ఖాతాలను ప్రారంభించుకోవచ్చని తాము తెలిపామని, కానీ మోదీ చెబితే చెప్పారు.. మనం నిజాయితీగా ఉండాలనే వాళ్లు భావించారని అన్నారు. అందుకే ఒక్కొక్కళ్లు 100, 200 రూపాయల చొప్పున ఆ ఖాతాల్లో జమచేసి మొత్తం 5 వేల కోట్ల రూపాయలతో ఖాతాలను తెరిచారన్నారు. ఈ విషయం ఆయన చెప్పగానే.. ఒక్కసారిగా ప్రేక్షకులంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో అభినందించారు.